Sheep Distribution Scam: సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ (Sheep Distribution Scam) కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కాంలోని బాధితులుగా ఉన్న 16మంది నుంచి సోమవారం వాంగ్మూలాలు తీసుకున్నారు. కాగా, ఈ కేసులో కీలకంగా ఉండి దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ ను వెనక్కి రప్పించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నిండుతాయంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, స్కీం మొదలైనప్పటి నుంచే దీంట్లో అక్రమాలు కూడా ఆరంభమయ్యాయి. పథకాన్ని ప్రకటించినపుడు 20 గొర్రెలు, ఒక పొటేల్ తో కూడిన యూనిట్ ధరను ప్రభుత్వం లక్షా 25వేలుగా నిర్ణయించింది.
Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!
పథకాన్ని సక్రమంగా అమలు చేశారా?
అయితే, బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్ ల ప్రవేశంతో యూనిట్ ధర లక్షా 75వేలకు పెరిగింది. అదీ ప్రభుత్వ ఆమోదం లేకుండానే. ఇక, పథకాన్ని సక్రమంగా అమలు చేశారా? అంటే అదీ చేయలేదు. గొర్రెల పెంపకందారుల నుంచి యూనిట్లు కొని వారికి ఇవ్వాల్సిన డబ్బుకు ఎగనామం పెట్టారు. తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన ఏడుకొండలుతోపాటు మరికొందరి నుంచి ఇలాగే యూనిట్లు కొని వారికి ఇవ్వాల్సిన 2.1 కోట్ల రూపాయలను తమ అకౌంట్లలో వేసుకున్నారు. రావాల్సిన డబ్బు కోసం అధికారులు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఏడుకొండలుతోపాటు మరికొందరు విక్రేతలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కుంభకోణం బయట పడింది.
700 కోట్ల రూపాయల వరకు అక్రమాలు
మొదట ఏసీబీ జరిపిన విచారణలో గొర్రెల పంపిణీలో 700 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయని బయటపడగా ఈడీ దర్యాప్తులో వెయ్యి కోట్ల రూపాయల వరకు నిధులు దారి మళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. కొన్నాళ్లుగా కేసు దర్యాప్తులో స్తబ్దత నెలకొగా తాజాగా ఈడీ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఏడుకొండలుతోపాటు మరో 15మంది గొర్రెల విక్రేతలకు నోటీసులు ఇచ్చి సోమవారం హైదరాబాద్ పిలిపించారు. బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో వారిని సుధీర్ఘంగా విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు. గొర్రెలు కొనే సమయంలో అధికారులు ఎవరెవరు వచ్చారు? అన్న వివరాలు తీసుకున్నారు. వారితోపాటు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ లు కూడా వచ్చారా? అని ప్రశ్నించారు. ఈ స్టేట్ మెంట్ల ఆధారంగా విచారణను ముమ్మరం చేయనున్నట్టు సమాచారం.
కుంభకోణం వెలుగు చూసి ఏసీబీ విచారణ
కాగా, ఈ కేసులో కీలకంగా ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ లను వెనక్కి పిలిపించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. కుంభకోణం వెలుగు చూసి ఏసీబీ విచారణ మొదలు కాగానే ఈ ఇద్దరు దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే, ఈ ఇద్దరిని విచారిస్తేనే వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్నది వెలుగు చూస్తుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఈ ఇద్దరిని వెనక్కి రప్పించాలని భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది.
Also Read: Mirai Movie: ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ.. ‘మిరాయ్’ మేకర్స్ సంచలన నిర్ణయం