NDA Meeting: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఎన్డీయే 2.0 కేబినెట్ మంత్రులు చివరి సమావేశమయ్యారు. తదుపరిగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. 17వ లోక్ సభను రద్దు చేయాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. తన రాజీనామా, మంత్రివర్గ సభ్యుల రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. వారి రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇదే రోజు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తూ మోదీ నాయకత్వంలో రాష్ట్రపతిని కోరే అవకాశం ఉన్నది.
ఎన్డీయే కూటమి సీనియర్ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌లు ఇది వరకే ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరితో ఈ రోజు నరేంద్ర మోదీ భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. శుక్రవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఉన్నది. ఆ సమావేశంలో బీజేపీ, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉన్నది. అదే రోజున మంత్రులుగానూ పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తున్నది.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ మార్క్‌ను దాటలేకపోయింది. దీంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో రాష్ట్రపతికి ప్రభుత్వ ఏర్పాటుకు ఏయే పార్టీలు విజ్ఞప్తి చేస్తాయనే ఉత్కంఠ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో రెండు పక్షాల కీలక నేతలు సమావేశం అవుతున్నారు. ఇటు ఎన్డీయే కూటమి నేతలు, అటు కాంగ్రెస్ కూటమి నాయకులు భేటీ అవుతున్నారు. భావి కార్యచరణపై మేధోమథనం జరుపుతారు. గత ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి 240కే పరిమితమైంది. ఎన్డీయే కూటమిగా మెజార్టీ 272 సీట్లకు మించి 293 సీట్లను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ గతంలో కంటే డబుల్ సీట్ల(99 సీట్లు)ను సాధించింది. కాంగ్రెస్ కూటమి మెజార్టీ మార్క్‌కు ఆమడ దూరంలో 232 సీట్ల దగ్గర ఆగిపోయింది.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఎన్డీయేలోని బీజేపీ మిత్రపక్షాలు మంత్రి పదవుల కోసం బేరసారాలు ఆడనున్నాయి. ఇది వరకే జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మూడు క్యాబినెట్ సీట్లు, ఏక్‌నాథ్ షిండే ఒక క్యాబినెట్ బెర్త్, రెండు సహాయ మంత్రి పదవులు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఒక కేబినెట్ సభ్యత్వం, మరో సహాయ మంత్రి పదవి, హిందుస్తాన్ ఆవామీ మోర్చా కూడా కొత్త ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి కోసం డిమాండ్ చేయనున్నట్టు తెలిసింది. ఇక టీడీపీకి మూడు నుంచి నాలుగు కేంద్ర మంత్రి పదవులు దక్కే చాన్స్ ఉన్నదని చర్చ జరుగుతున్నది.