CM Revanth Reddy About Telangana Loksabha Election Results
Politics

CM Revanth Reddy : కేసీఆర్.. పొలిటికల్ జాదూ!

– బీజేపీ బలోపేతానికి బీఆర్ఎస్సే కారణం
– కమలం గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్‌కు డిపాజిట్లు నిల్
– కుమ్మక్కయి ఓట్లు బదిలీ చేశారు
– బీఆర్ఎస్ చనిపోతూ బీజేపీకి ప్రాణం పోసింది
– పార్లమెంట్ ఫలితాలు ఉగాది పచ్చడిలా వచ్చాయి
– కాంగ్రెస్ మెరుగైన ఫలితాలే సాధించిందన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy About Telangana Loksabha Election Results : మోదీపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు రేవంత్. రెండుసార్లు బీజేపీ కేంద్రంలో మెజార్టీ సీట్లను సాధించి గద్దెనెక్కిందని, కానీ, ఈసారి 303 సీట్ల నుంచి 240కి దిగజారిందని విమర్శించారు. మోదీ గ్యారెంటీ అయిపోయిందని, ఆయన కాలం చెల్లిన మెడిసిన్ అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజా ఫలితాల నేపథ్యంలో మోదీ హుందాగా తప్పుకోవాలని, మళ్లీ ఆ పదవి చేపట్టొద్దని హితవు పలికారు. అలాకాకుండా, మూడోసారి పదవి చేపడతా, కుట్రలకు పాల్పడుతా అంటే ఉరుకోమని హెచ్చరించారు.

పార్లమెంట్ ఫలితాలు ఉగాది పచ్చడిలా వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. ‘‘నేను రాష్ట్ర సీఎంను. ఒక్క జిల్లాకే పరిమితం కాదు. గతంలో ఉప ఎన్నికల సమయంలో ఓడితే నేనే బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ గెలిచినా, ఎంత మెజార్టీ వచ్చినా దానికి నేనే కారణం. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ బలిచ్చారు. ఆయన పెద్ద పొలిటికల్ జాదూ. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఫలితాలపై నేతలతో మాట్లాడాను. భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశాం. రాహుల్ గాంధీ పాదయాత్ర పార్టీ బలోపేతానికి దోహదం చేసింది. మోదీ వైఫల్యాలను దేశవ్యాప్తంగా రాహుల్ తీసుకెళ్లారు. కూటమి కట్టి పనిచేశారు. రాహుల్ పాదయాత్ర దేశంలో మార్పును కోరుకుంది. తెలంగాణలో మంచి స్థానాలను గెలిచాం. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు దక్కాయి. వంద రోజుల్లో పలు గ్యారెంటీలను అమలు చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లోకి దిగాం. ప్రజల పట్ల వున్న నమ్మకంతో వెళ్ళాం. పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు సాధించాం. అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా వచ్చాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 8కి పెరిగింది. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. కంటోన్మెంట్ కూడా దక్కించుకున్నాం. 13 వేల మెజార్టీతో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతున్నా. గెలిచిన 8 సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలిచాం’’ అని వివరించారు సీఎం.

బీజేపీ కూడా 8 సీట్లు గెలిచిందన్న రేవంత్, దీని వెనుక కేసీఆర్ క‌‌ృషి ఎంతో ఉందన్నారు. ‘‘7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది. అవయవదానం చేసినట్లు బీజేపీ కోసం పనిచేసింది. నేను ముందే చెప్పాను. బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ కోసమేనని. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయ్యాయి. రఘునందన్ రావు గెలుపు కోసం పనిచేశారు. సిద్దిపేట మైనస్ వల్లే మెదక్ పార్లమెంట్‌లో నీలం మధు ఓడిపోయారు. 13 శాతం నుంచి 33.5 శాతానికి బీజేపీ ఓట్లు పెరిగాయి అంటే దానికి బీఆర్ఎస్సే కారణం. బీజేపీని గెలిపించిన 8 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయింది. బీఆర్ఎస్ చనిపోతూ బీజేపీకి ప్రాణం పోసింది. ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ, ఫినిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకుంటామని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తీరు మార్చుకోవాలి. కేసీఆర్ తన ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలి. హరీష్ రావు మానవ బాంబులా మారి మా పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారు’’ అంటూ ఫైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటామని, ఆంధ్రాకు ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ