Daggubati Brothers: దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు (Deccan Kitchen Demolition Case)లో టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), దగ్గుబాటి రానా (Rana), నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu), అభిరామ్ (Abhiram).. మరోసారి కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. పద్దెనిమిది నెలలుగా విచారణ జరుగుతున్నా.. కేసులో నిందితులుగా ఉన్నవారు ఒక్కసారి కూడా విచారణకు రాకపోవటంతో కోర్టు సీరియస్ అయ్యింది. తదుపరి విచారణకు ఖచ్చితంగా నిందితులు నలుగురు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నందకుమార్ అనే వ్యక్తికి చెందిన దక్కన్ కిచెన్ హోటల్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది, కొందరు బౌన్సర్లు కలిసి 2004, జనవరిలో పూర్తిగా కూల్చి వేసిన విషయం తెలిసిందే. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడ వద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. తన హోటల్‌ను కూల్చి వేశారని పేర్కొంటూ న్యాయం జరిగేలా చూడాలని నందకుమార్ నాంపల్లిలోని 17వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read- Nayanthara: ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందే.. నయనతారకు కొత్త చిక్కులు!
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే..
దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్‌లపై కేసులు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసులు రిజిష్టర్ చేశారు. కాగా, కోర్టులో పద్దెనిమిది నెలలుగా విచారణ సాగుతున్నా, ఒక్కసారి కూడా నిందితులు కోర్టుకు హాజరు కాలేదు. క్రితంసారి విచారణ సందర్భంగా నిందితులు వ్యక్తిగతంగా రావాలని చెప్పినా.. బుధవారం జరిగిన విచారణకు మరోసారి నలుగురు గైర్హాజరయ్యారు. తమ తరపున న్యాయవాదులను పంపించారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ రోజు నలుగురు నిందితులు తప్పనిసరిగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read- Allu Arjun- Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ
అప్రూవర్‌గా మారలేదనే…
కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అప్రూవర్‌గా మారలేదనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తనపై అక్రమ కేసులు నమోదు చేయించటంతో పాటు హోటల్‌ను కూల్చి వేయించారని నందకుమార్ (Nandakumar) ఆరోపించారు. కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ల సూచనల మేరకే ఇదంతా జరిగిందని చెప్పారు. దీంట్లో ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల హస్తం ఉందని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో రాధాకిషన్ రావు.. దగ్గుబాటి బ్రదర్స్‌తో మీటింగ్ పెట్టి మరీ తనను వేధింపులకు గురి చేశారన్నారు. ఈ క్రమంలోనే తనపై అక్రమంగా 12 కేసులు బనాయించి, బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయితే, తాను దేనికీ లొంగలేదని చెప్పారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే తనపై నమోదు చేసిన కేసుల్లో నుంచి బయటకు వచ్చానన్నారు. ఇప్పటికీ చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ భయపడేది లేదని చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు