ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లుతుందని, అందుకే ప్రభాకర్ రావును రానివ్వకుండా కేసీఆర్.. హరీశ్ రావును అమెరికాకు పంపించాడని, చికాగోలో ప్రభాకర్ రావును హరీశ్ రావు కలిశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తాను విదేశాలకు వెళ్లింది వాస్తవమేనని అన్నారు. కానీ, అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి వెంకట్ రెడ్డి రుజువు చేస్తే తాను అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తానని, లేకపోతే మంత్రి వెంకట్ రెడ్డి రాయాలి అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
మంత్రులు అబద్ధాలు చెబుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, తాను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి వెంకట్ రెడ్డి చెబుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధం. ఒక వేళ రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను, తదితర వివరాలు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’ అని హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
‘నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇది చౌకబారుతనం’ అని హరీశ్ రావు విమర్శించారు. కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో ఆయన చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, ఆధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో రాకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన సమయానికి అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తానని, ఆధారాలతో మంత్రి రెడీగా ఉండాలని అన్నారు. మీడియాలో బ్రేకింగుల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.