TSUTF Demands: ఐదేళ్ల పైబడి సర్వీసున్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Teacher Eligibility Test) ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఈనెల 1న ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని టీఎస్ యీటీఎఫ్(TSUTF) నాయకులు డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మహారాష్ట్రకు సంబంధించిన కేసు
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23 న ఎన్ సీటీ(NCTE)ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని వారు గుర్తుచేశారు. అప్పటికే నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ అవసరమా?, లేదా? అనే వివాదంపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు. మైనారిటీ విద్యా సంస్థల్లో నియామకాలకు టెట్ తప్పనిసరా? కాదా? అనే అంశంపై మహారాష్ట్రకు సంబంధించిన కేసుతోపాటు, ప్రమోషన్ల విషయంలో తమిళనాడు ఉపాధ్యాయుల కేసులను కలిపి విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 1 న వెలువరించిన తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు అశనీపాతంగా మారిందన్నారు. ఉపాధ్యాయుల భవిష్యత్ పై సందిగ్ధత నెలకొందన్నారు. మైనారిటీ విద్యాసంస్థల కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన న్యాయమూర్తులు.., మైనారిటీ యేతర విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు సంబంధించి ఇంతటి కఠినమైన తీర్పును ఇవ్వడం విచారకరమని పేర్కొన్నారు.
Also Read: CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ..
పాతికేళ్లుగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు కేవలం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదని పేర్కొన్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ(Telangana) ఏర్పాటు అనంతరం 2015 లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనలు రూపొందించిన ఉత్తర్వుల్లో 2010 ఆగస్టు 23 కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్(TET) ఉత్తీర్ణత మినహాయించినట్లు స్పషంగా పేర్కొన్నారు. అందుకే 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు టెట్ రాయాలనే ఆలోచన చేయలేదన్నారు. ఇప్పుడు హఠాత్తుగా రెండేళ్లలో టెట్ పాస్ కావాలంటే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారని వారు పేర్కొన్నారు. ఎన్ సీటీఈ నోటిఫికేషన్(2010 ఆగస్టు 23) తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని, అంతకు ముందు నియామకమైనవారికి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
Also Read; Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?