Telangana Formation Day: తెలంగాణ అవతరణ వేడుకలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్నది. ఈ వేడుకలకు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఆహ్వానిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆమె రాష్ట్ర అవతరణ వేడుకలకు రాలేకపోయారు. కానీ, రాష్ట్ర ప్రజలకు వీడియో రూపంలో సందేశాన్ని ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం అని సోనియా గాంధీ తెలిపారు. తాము 2004లో కరీంనగర్‌లో నిర్వహించిన ఓ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ హామీ కట్టుబడే ప్రత్యేక తెలంగాణను ఇచ్చామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీలోనే కందరు నేతలు వ్యతిరేకించారని, తమ నిర్ణయంతో విభేదించి విడిపోయారనీ వివరించారు. కానీ, తాము మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు చెప్పిన సోనియా గాంధీ గతంలోలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ ఆమె సెలవు తీసుకున్నారు.