– ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకోం
– ఎగ్జాక్ట్ పోల్స్ కోసం చూస్తున్నాం
KTR: శనివారం సాయంత్రం లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు ఈ సర్వేలు వెల్లడించాయి. చాలా సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు దక్కవని అంచనాలు వేశాయి. తమ ఉనికి చాటుకోవడానికి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం గులాబీ పార్టీకి ఆశలను వమ్మూ చేసేలా ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన కోరగా.. ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను తాము పరిగణనలోకి తీసుకోబోమని, ఎగ్జాక్ట్ పోల్స్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం చూస్తున్నామని వివరించారు. అమరజ్యోతి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ శనివారం సాయంత్రం తెలంగాణ అవతరణ వేడుకలు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి అమరజ్యోతి వరకు సాగే క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని, పౌరుషాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.