– 34 లొకేషన్స్‌లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
– చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలు
– లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
– అత్యధికంగా 24 రౌండ్లు, అత్యల్పంగా 13 రౌండ్లు
– 2న మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
– 5న నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
– సీఈవో వికాస్ రాజ్ వెల్లడి
Votes Counting: లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి వచ్చాయి. ఏడు విడతల్లో చిట్ట చివరి దశ పోలింగ్ ఈ రోజు (శనివారం) జరుగుతున్నది. లోక్ సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. 4వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ గురించి చెప్పారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉన్న చోట అరగంట ఆలస్యంగా కౌంటింగ్ మొదలవుతుందని వివరించారు. రాష్ట్రంలో 34 లొకేషన్స్‌లలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు. వీటితోపాటు ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు గురించీ ముఖ్యమైన వివరాలు తెలిపారు.
చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ హాల్ వద్ద 100 మీటర్ల వరకు అనుమతి లేకుండా ఎవరూ వచ్చే అవకాశం లేదని, కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక్కడ 12 కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కు ఈవీఎం పరికరాలను తెచ్చే దారి కూడా సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని వివరించారు. ఒక్కో టేబుల్ వద్ద ఈసీఐ అబ్జర్వర్ ఉంటారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రౌండ్‌కు సిబ్బందితోపాటు ఈసీ అబ్జర్వర్లు కూడా ఈవీఎం కౌంటింగ్ చేపడతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లను, 2,440 మైక్రో అబ్జర్వర్లను ఈసీఐ నియమించిందని చెప్పారు.
కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని సీఈవో తెలిపారు. చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లు, ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లు ఉంటాయని వివరించారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్సీ కౌంటింగ్:
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 2వ తేదీన జరుగుతుంది. ఇదీ మహబూబ్‌నగర్‌లోనే జరుగుతుందని, ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇక ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జూన్ 5వ తేదీన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కౌంటింగ్ కోసం కూడా తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు సాయంత్రం 6.30 తర్వాత విడుదల చేసుకోవచ్చని సూచించారు.