CM Revanth Special Focus On End Of Corruption
Politics, Top Stories

CM Revanth: అవినీతి అంతం, రేవంత్ పంతం

– తెలంగాణలో పెచ్చు మీరిన లంచగొండితనం
– ప్రభుత్వం మారినా పద్ధతి మార్చుకోని లంచావతారాలు
– కీలక శాఖల్లో తిష్టవేసుకున్న అవినీతి అధికారులు
– గత పదేళ్లలో నిర్వీర్యమైన ఏసీబీ వ్యవస్థ
– ఏసీబీ కోరలకు మరింత పదును పెడుతున్న కాంగ్రెస్ సర్కార్
– రోజురోజుకూ పెరుగుతున్న ఏసీబీ దాడులు
– ధైర్యంగా మందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్న బాధితులు
– రోజురోజుకూ ఏసీబీ వలకు చిక్కుతున్న అవినీతి చేపలు

CM Revanth Special Focus On End Of Corruption: ప్రభుత్వోద్యోగులంటే సమాజంలో ఎంతో గౌరవం. గతంతో పోల్చితే ప్రభుత్వాలూ వీరికి మంచి వేతనాలు, సౌకర్యాలు అందిస్తున్నాయి. అయితే, కొందరు అక్రమార్కులు మాత్రం లంచాల పేరుతో ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటూ మొత్తం ఉద్యోగ వ్యవస్థకే మాట తెస్తున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా వీరి ధోరణిలో మాత్రం ఏమార్పూ రావటం లేదు. గత పదేళ్ల కాలంలో తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బాగా పెరిగిందని, ఒక రకంగా అది వ్యవస్థీకృతమైందని సామాజిక వేత్తలు గణాంకాలతో వివరిస్తున్నారు. ఈ దశాబ్ద కాలంలో ఏసీబీ వంటి వ్యవస్థలు కోరలు లేని పాములుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించింది. ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి అక్రమార్జనకు అలవాటు పడిన వారి భరతం పడుతోంది. దీంతో గత పాలకుల అండతో దశాబ్దాలుగా ఒకేచోట తిష్టవేసుకుని కూర్చున్న లంచావతారాల బాగోతం ఏసీబీ దాడుల కారణంగా బయటపడుతోంది. ఏసీబీ దాడుల్లో రోజూ పట్టుబడుతున్న ఈ అవినీతి తిమింగలాల సంఖ్య నానాటికీ పెరగటంతో, అటు ప్రజల్లోనూ ఏసీబీ వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల నమ్మకం పెరుగుతోంది.

రేవంత్ రాకతో మారిన సీన్..

డిసెంబరు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, ఆదిలోనే అవినీతిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ)గా సీవీ అనంద్ బాధ్యతలు స్వీకరించాక తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వండని ఏసీబీ అధికారులు గవర్నమెంట్ ఆఫీసుల్లో పోస్టర్లు, స్టిక్కర్లు అంటించడం, నిత్యం ఏదో ఒక చోట ఏసీబీ దాడులు జరుగుతుండడంతో ప్రజలు కూడా లంచం అడిగే ఆఫీసర్లను పట్టించేందుకు ముందుకొస్తున్నారు. నిరుడు మొత్తం కలిపి ఏసీబీ 94 కేసులు నమోదు చేస్తే కొత్త ప్రభుత్వంలో, కొత్త సంవత్సరంలో మూడు నెలలు కూడా గడవకముందే 42 కేసులు నమోదు కావడం గమనార్హం. గతంలో కేవలం సోదాలకే పరిమితమైన ఏసీబీ, ఈసారి అక్రమార్కులను అరెస్టు చేసి కోర్టుమందు నిలబెట్టటంలోనూ విజయవంతమైంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదు అవుతున్న పరిస్థితి.

Also Read: గవర్నర్ కు ‘ఆవిర్భావ’ ఆహ్వానం

పెద్ద చేపలు ఎన్నో

రాష్ట్రంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టించింది. బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ఇండ్ల స్థలాలుండగా ఏపీలోని ఆస్తులతో కలిపి రూ. 1000 కోట్లకు పైగా అక్రమార్జన చేసినట్లు తేలింది. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని గత సర్కార్ హయాంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలుండగా, ఏసీబీ దాడిలో రూ.20 కోట్లు పైనే ఆస్తులున్నట్లు, ఆమె బినామీ వేసిన వెంచర్ల విలువ రూ. 70 కోట్లుగా ఏసీబీ లెక్కతేల్చింది. మరోవైపు, ఏసీపీ ఉమామహేశ్వరరావు బాగోతాన్ని కూడా ఏసీబీ జనం ముందుకు తెచ్చింది. ఏసీబీ సోదాల్లో రూ. 3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించగా, వీటి బహిరంగ మార్కెట్లో పదిరెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా. గత బీఆర్‌‌ఎస్ సర్కార్ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో అవినీతి ప్రకంపనలు రేపింది. ఈ స్కామ్ పై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కామారెడ్డి వెటర్నరీ దవాఖాన అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ రవి, మేడ్చల్‌‌ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌‌డైరెక్టర్‌‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌‌ గణేశ్​ను అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ పత్రాలు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సుమారు రూ. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌ అరెస్ట్ అయ్యారు. శుక్రవారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో కల్యాణ్‌తో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈవో రాంచందర్‌ను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. వీరుగాక.. గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా ఇలా ఎందరి అవీనీతి బాగోతాన్ని ఏసీబీ బయటపెట్టింది.

ప్రభుత్వంపై ప్రశంసలు

పాలకులు చిత్తశుద్ధితో… సమర్థులు, నిజాయితీ పరులైన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించటం సాధ్యమేనని ఏసీబీ గణాంకాలే సాక్షమని సామాజిక వేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మంచి మార్కులు దక్కుతున్నాయి. గత పదేళ్ల కాలంలో తిష్టవేసుకుని జనాన్ని పీడిస్తున్న లంచావతారాలను ఇదే జోరున పట్టుకుని చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షలు వేయిస్తే తప్ప మన వ్యవస్థ బాగుపడదని యువత ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, ఇది ఆరంభమేనని, రాబోయే రోజుల్లో ఈ దాడులు మరింత తీవ్రతరమవుతాయని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు