Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ విచారణకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన విచారణకు సీబీఐ(CBI)కి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో (నెంబర్ 104) జారీ చేసింది. ఇక, జీవో కాపీ అందినట్టుగా సీబీఐ వర్గాలు ధృవీకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అప్పటి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టించిన విషయం తెలిసిందే. అయితే, కట్టిన నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లోని 16, 17, 18, 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై విచారణకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రత్యేక బృందాన్ని నియమించింది. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్షుణ్నంగా తనిఖీలు జరిపిన ఈ బృందం 2023, అక్టోబర్ 24న రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నివేదికను ఇచ్చింది. తుది నివేదికను గత ఏప్రిల్ 24న అంద చేసింది.
నోటీసులు ఇవ్వటం ద్వారా
దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ లోపాలతోపాటు నాణ్యతను పట్టించుకోక పోవటం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) పిల్లర్లు కుంగిపోయాయని స్పష్టంగా పేర్కంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తటంతో ఈ నివేదికకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ పీ.సీ.ఘోష్(Justice P.C. Ghosh) నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై కమిషన్ ను నియమించింది. పీ.సీ.ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఇంజనీర్లతోపాటు వేర్వేరు ప్రభుత్వ విభాగాల అధికారుల నుంచి స్టేట్ మెంట్ల రూపంలో వివరాలను సేకరించింది. నోటీసులు ఇవ్వటం ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), ఈటెల రాజేందర్(Etela Rajender)ల నుంచి కూడా వివరాలు తీసుకుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
Also Read: CM Revanth Reddy: నిత్యం ప్రతిపక్షంగా ఉంటూ.. ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే.. సీఎం రేవంత్
నిర్మాణ లోపాలతోపాటు
పీ.సీ.ఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ లోపాలతోపాటు నాణ్యతను పాటించలేదని స్పష్టం చేసింది. దాంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ పనులకు చేసిన చెల్లింపులు.. ఆ మొత్తాలు అంతిమంగా ఎవరికి.. ఎంతెంత? చేరాయన్న దానిపై లోతైన దర్యాప్తు జరిపించాలని సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పై కూడా విచారణ జరిపించాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ ను పునర్నించటం.. మరమ్మత్తులకయ్యే ఖర్చులను నిర్మాణ సంస్థే భరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లను కూడా కమిషన్ తప్పు పట్టింది. ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఐఏఎస్(IAS) అధికారులు, ఇంజనీర్లపై చర్యలకు కూడా సిఫార్సు చేసింది.
ఏజన్సీల ప్రమేయం
ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31న అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ జరిపింది. అదే రోజు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును విచారణ నిమిత్తం సీబీఐ(CBI)కి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా సీబీఐ విచారణకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజన్సీల ప్రమేయం ఉన్నట్టుగా పేర్కొంది. అన్ని వివరాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం జారీ చేసిన జీవో (జీవో నెంబర్ 51) నిబంధనలను సడలిస్తున్నట్టు పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణకు అనుమతి ఇస్తున్నట్టుగా తెలియచేసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అందినట్టుగా హైదరాబాద్ రీజనల్ కార్యాలయం అక్ నాలెడ్జ్ మెంట్ ను ప్రభుత్వానికి పంపించింది.
Also Read: Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!