congress mlc slams kcr ktr regarding changes in state emblem | Congress MLC: అమరుల చిహ్నం పెడితే మీకు నొప్పేంటీ?
congress mlc mahesh kumar goud
Political News

Congress MLC: అమరుల చిహ్నం పెడితే మీకు నొప్పేంటీ?

– తాను వెనుకబడిపోతాననే కేసీఆర్ నానాయాగి
– ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వ నిర్ణయాలు
– వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు
– రాష్ట్ర చిహ్నం మార్పులో ముందుకే

Telangana Emblem: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాచరికం గుర్తులను కాదని, ప్రజల చరిత్రను ప్రతిబింబించేలా.. వారి ధిక్కార పోరాటాలకు ప్రతీకగా రాష్ట్ర చిహ్నాన్ని మార్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి, అందులో అమరువీరుల స్థూపం చిత్రాన్ని చేర్చాలని అనుకుంటున్నది. రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాకున్నప్పటికీ కాంగ్రెస్ చెబుతున్న మార్పులపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నది. నిరసనలూ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లు వంచించారని, పదేళ్లు దోపిడీకి పాల్పడ్డారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పాలనతో విసుగెత్తిన ప్రజలు ఆయనను ఇంటికి పంపించారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి అడుగూ ప్రజల ఆలోచన మేరకు వేస్తున్నారని, ప్రతి విషయాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర చిహ్నంపైనా చర్చ జరిగిందని, లోటుపాట్లు, అభ్యంతరాలు లేకుండా చిహ్నం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నదని వివరించారు. కేసీఆర్ తన పదేళ్లపాలనలో ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ అంటే అంతా తానే అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారని, ఒంటెద్దు పోకడలతో పాలన సాగించారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అసలు రాష్ట్ర చిహ్నంలో రాచరికాల గుర్తులు తొలగించి అమరవీరుల స్థూపం చిహ్నం పెడితే తప్పేంటీ? అని ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం పెడితే కేటీఆర్, కేసీఆర్‌కు వచ్చే నొప్పి ఏమిటని అడిగారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం చిహ్నం పెడితే తాను వెనుకబడిపోతాననే కేసీఆర్ నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త చిహ్నం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొత్త అమరవీరుల స్థూపంపై ఒక్క అమరుడి పేరు కూడా చెక్కలేదని అన్నారు.

బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ స్థానికవాదాన్ని తెస్తున్న నేపథ్యంలో మాట్లాడుతూ గతంలో సీఎం కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టినప్పుడు కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంట్ గుర్తు రాలేదా? అందెశ్రీ రాసిన పాటను పదేళ్లుగా ఎందుకు గుర్తించలేదనీ ప్రశ్నించారు. తెలంగాణ అనే పదాన్ని పార్టీ నుంచి తీసేసిన కేసీఆర్, కేటీఆర్‌లకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హతే లేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తున్నదని తెలిపారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..