DK Aruna: గద్వాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తా
గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి
ఉపాధ్యాయ సంఘం సమావేశంలో మాట్లాడిన డీకే అరుణ
గద్వాల, స్వేచ్ఛ: గద్వాల ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేసిన అభివృద్దే తప్ప గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ (DK Aruna) అన్నారు. ఈ ప్రాంత నేతగా గద్వాలకు పూర్వవైభవం తెచ్చేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గద్వాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం’ (తపస్ ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘గురు వందనం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
గురువులు సమాజంలో మార్గ నిర్దేశకులని, సమాజాన్ని సన్మార్గంలో నడిపించే గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీకే అరుణ అన్నారు. ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గద్వాలలో నేడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. ‘‘నా ఎదుగుదలను ఓర్వలేక, కుట్రలో భాగంగా ఓ రాజకీయ నాయకుడు చేసిన తప్పిదం కారణంగా ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఉన్న గద్వాలను నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోకి మార్చారు’’ అని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
Read Also- Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!
ఇకపై 15 రోజులకు ఒకసారి వస్తా
మహబూబ్‌నగర్ ఎంపీగా ఏడు నియోజకవర్గాలలో జరిగే కార్యక్రమాలలో, పార్టీ బాధ్యతలలో బిజీగా ఉండడంతో గద్వాలకు రాలేకపోతున్నానని డీకే అరుణ చెప్పారు. ప్రస్తుతం గద్వాలలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి రహదారులపై గుంతలు ఏర్పడి, రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. రానున్న రోజులలో 15 రోజులకు ఒకసారి గద్వాలకు వచ్చి నడిగడ్డ అభివృద్ధిలో భాగంగా పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో తపస్ స్టేట్ ప్రెసిడెంట్ హనుమంతరావు, జిల్లా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరి శ్రీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Also- Period Delay: పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయని మెడిసిన్ తీసుకుంటున్నారా?.. అయితే, డేంజర్లో పడ్డట్టే!