- ఎన్నికలప్పుడే తెలంగాణ ఉద్యమం అంటున్న బీజేపీ
- తెలంగాణ ఉద్యమంలో కమలనాధుల తటస్థ వైఖరి
- సోనియా సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం
- సెంటిమెంట్ ను అనుకూలంగా మార్చుకున్న బీఆర్ఎస్
- ఉద్యమాలకు దూరంగా ఉన్న బీజేపీ
- ఆంధ్రా ఓటర్లకు భయపడి ఉద్యమానికి దూరం పెట్టిన బీజేపీ
- కేంద్ర పాలితం చేస్తామంటూ భయపెడుతున్న బీజేపీ
- తెలంగాణ ఆవిర్భవానికి సోనియాగాంధీని రావద్దొంటున్న కిషన్ రెడ్డి
- బీజేపీకి ఆ అరర్హత లేదంటున్న కాంగ్రెస్ వర్గాలు
Telangana movement bjp nominal role pending Separation guarantees:
తెలంగాణ ఉద్యమం చాలా ప్రత్యేకం. పాటతో పెనవేసుకున్న తెలంగాణ, ఆ పాటను కూడా పోరాటంలో తూటాలా పేల్చింది. బతుకమ్మలతో సాంస్క్రతిక ప్రత్యేకత చాటింది. వాంటావార్పులతో పోరును ఘాటెక్కించింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, దీక్షలు, రాజీనామాలు, ఇలా ఏ ఉద్యమంలోనూ కనపడని విభిన్న, విశిష్ట కోణాలు తెలంగాణ పోరులో కనపడతాయి.. అమరవీరుల ప్రాణత్యాగాలు తెలంగాణ పోరును భావోద్వేగంగా మార్చాయి. శ్రీకాంతాచారి ఆత్మాహుతి, తెలంగాణ వాదుల గుండెలను మండించింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఇంకా అనేక విద్యా సంస్థలు, గ్రామాల్లో విద్యార్థులు బలిదానమయ్యారు. దాదాపు 11వందల మంది యువకులను తెలంగాణ కోసం అమరులయ్యారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం తామే మోసామన్నట్లుగా కొన్ని పార్టీలు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తూ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున సోనియాగాంధీని తెలంగాణకు ఆహ్వానించే విషయంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా తెలంగాణకు ఎందుకు రావాలి? ఆమెకున్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రజానీకం కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పడుతున్నాయి.
చరిత్రను మలుపు తిప్పిన ఉద్యమం
స్వాతంత్రోద్యమ కాలంలో ఎదిగిన రాజకీయ నాయకత్వం వల్ల అది చరిత్రను మలుపు తిప్పిన ఉద్యమం అయ్యింది. జై తెలంగాణ ఉద్యమానికి 1969లో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి ఒక భూస్వామ్య భావజాలం నుంచి వచ్చిన వారు. ఉద్యమాన్ని చివరి దాకా తీసుకుపోలేదు. ఆ ఉద్యమంలో 350 మంది విద్యార్థులు చనిపోయారు. నాయకత్వం నిజాయితీగా పనిచేయకపోవడం వల్ల ఆ ఉద్యమం విఫలమైంది. తిరిగి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1996 నుంచి ప్రారంభమైనప్పుడు తెలంగాణలో ఎదిగిన రాజకీయ నాయకత్వంలో చాలా వరకు భూ ఆక్రమణ దారులు, కాంట్రాక్టర్లు, మద్య దళారీలు. ఈ ఉద్యమం ఈ వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన డాక్టర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే మరణించారు.
బీజేపీని నమ్మని ప్రజలు
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 90వ దశకంలోనే ప్రకటించింది. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధమేనని ప్రకటించింది.
1998లో కాకినాడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. 1998 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ‘ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ అనే అంశాన్ని ప్రచారం చేసింది. తర్వాత తెలంగాణ అంశాన్ని బీజేపీ పక్కన పెట్టడంతో ఆగ్రహించిన ఎంపీ ఆలె నరేంద్ర పార్టీ నుంచి బయటకు వచ్చి ‘తెలంగాణ సాధన సమితి’ని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. తర్వాత ఈ పార్టీని 2002 ఆగస్టు 11న టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు.2004లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాయి. ఈ రెండింటికీ ఎదురుదెబ్బ తగిలింది.
విభజన హామీలన్నీ అటకెక్కించిన కేంద్రం
మొదటినుంచీ ప్రత్యేక తెలంగాణ విషయంలో బీజేపీ తటస్థంగానే ఉంటూ వచ్చింది. అందుకే ఉద్యమ సమయంలో అంటీముట్టనట్లు ప్రవర్తించింది. బయటనుంచి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే ఆంధ్రా ఓటర్లు తమకు దూరం అవుతారనే ఆలోచనతో తాము అధికారంలో లేమనే సాకుతో తప్పించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతి బడ్జెట్ లోనూ తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చింది. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ రావడానికి కారణమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ మాత్రమే. అయితే కాంగ్రెస్ ఇచ్చిన విభజన హామీలను తర్వాత వచ్చిన బీజేపీ అటకెక్కించేసింది. ఇప్పటికీ పదేళ్లు పూర్తయినా..విభజన హామీలన్నీ ఎక్కడిక్కడే పెండింగ్ లో ఉన్నాయి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుందా అంటున్నారు రాజకీయ విమర్శకులు.
తెరపై కేంద్రపాలితం
బీజేపీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఓ రహస్య ఎజెండా దాగి ఉన్నది. హైదరాబాద్ ఆదాయాన్ని ఒక్క ప్రాంతానికే పరిమితం చేసి, మిగతా తెలంగాణ జిల్లాలను అంధకారంలోకి నెట్టడమే బీజేపీ లక్ష్యం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తున్నారనే కత్తిని తెలంగాణ మెడపై ఉంచి, రాష్ట్రంలో అశాంతి రగిలించాలనే పన్నాగాన్ని బీజేపీ పన్నుతోంది. ఏపీ విభజన ఒక పనికిమాలిన ప్రయత్నమనేది బీజేపీ వాదన. సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ కూడా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రం అనేదే ఆ బీజేపీ విధానం అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంపై ఏ మాత్రం పట్టులేని బీజేపీ ఇప్పుడు తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ తెలంగాణకు రాకూడదని చెప్పే అర్హత ఏ మాత్రం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.