CM Revanth Reddy: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం.. ఆయన వ్యక్తిత్వం, మంచితనాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన తను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని అన్నారు. ఏ జెండాను మోయడం గొప్పగా భావించారో చివరి శ్వాస వరకు ఆ జెండా నీడలోనే ఉండటం చాలా అరుదని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారిలో సురవరం సుధాకర్ రెడ్డి ఒకరని కొనియాడారు.
‘తగిన గుర్తింపు ఇస్తాం’
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గోల్కొండ పత్రికతో ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి పోరాటం చేశారు. మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాకు వన్నె తెచ్చారు. రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి జిల్లాకు వన్నె తెచ్చారు. సురవరం సుధాకర్ రెడ్డికి మంచి గుర్తింపు ఇచ్చే విధంగా మంత్రివర్గంతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఆనాడు సుధాకర్ రెడ్డి గారి సూచన మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పోరాటం చేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అలాంటివారి చిరునామా తెలంగాణలో శాశ్వతంగా ఉండాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
‘కమ్యూనిస్టు సిద్ధాంత పరిధి పెరగాలి’
ప్రజల కోసం పోరాడిన వారిని తగిన గౌరవం ఇచ్చే విధంగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటామని రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు చేసుకుంటున్నాం. నిత్యం ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు తలచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయని నేను బలంగా నమ్ముతున్నా. కమ్యూనిస్టు సిద్ధాంత పరిధి పెరగాలి. కమ్యూనిజం అంటే కేవలం లైబ్రరీలో చదివే పుస్తకం కాదు.. ప్రజల పక్షాన పోరాడే చైతన్యం. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన చేసే వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. జాతీయ స్థాయి రాజకీయాల్లో సురవరం లాంటి వారి అవసరం ఇప్పుడు ఉంది’ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read: Modi China Visit: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాలో అడుగుపెట్టిన మోదీ.. అదిరిపోయేలా స్వాగతం
దేశంలో ఓట్ల చోరిపై..
‘దేశంలో అధికారంలో ఉన్న వాళ్లు ఎన్నికల కమిషన్ ను కూడా భాగస్వామ్యం చేసుకుని అధికారం పదిలపరుచుకోవాలనుకుంటున్నారు. వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ప్రజాస్వామ్యవాదులారా ఒక సారి ఆలోచించండి. నాలుగు నెలల్లో కోటి ఓట్లు పుట్టగలవా? బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగించి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. విపరీతమైన పోకడలను కట్టడి చేసేందుకు మనమంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఈ వేదికగా కోరుతున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.