Sugali Preethi Case: మరోసారి నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడిని టార్గెట్ చేస్తూ, అందరినీ కన్ఫ్యూజ్ చేసే పూనమ్ కౌర్, ఈసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ చేస్తుందో, ఏం చెప్పాలనుకుంటుందో.. అనే దానిపై అందరిలో కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి చెప్పగలిగే స్టామినా ఉండి కూడా ఆమె అలా దాగుడు మూతల తరహాలో ట్వీట్స్ వేయడంపై జనాలు కూడా ఆసక్తి చూపించడం తగ్గించేశారు. మరీ ముఖ్యంగా, ఆమె ట్వీట్స్‌ని, ఆమె దగ్గర ఉన్న విషయాన్ని వాడుకుని మైలేజ్ పొందాలని చూసే వాళ్లని కూడా ఆమె డిజప్పాయింట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సుగాలి ప్రీతి కేసుపై స్పందిస్తూ.. ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
టార్గెట్ పవన్ కళ్యాణ్
‘జల్సా’ సినిమాలో అవకాశం ఇస్తామని మోసం చేసినట్లుగా చెప్పుకునే పూనమ్ కౌర్.. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram)లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సుగాలి ప్రీతి తల్లి (Sugali Preethi Mother) మీడియా ముందుకు వచ్చి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు ఇదే ఉంటుందని చెప్పి, ఇప్పుడసలు పట్టించుకోవడం లేదనేలా.. ఒకప్పుడు ఆమె ఎవరినైతే నమ్మలేదో.. వారికే చెందిన ఛానల్‌లో చెప్పుకొచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవక తప్పలేదు. తాజాగా ఆయన జనసేన టీమ్‌తో జరిపిన సమావేశంలో సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించారు. అసలు ఆ కేసు వార్తలలో ఉండటానికి, ఆ కుటుంబానికి గత ప్రభుత్వం సాయం చేయడానికి కారణమే తను అని ప్రస్తావించారు. అయినా కూడా తన చిత్తశుద్దిని నమ్మడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read- OG Film Record: ఈ రికార్డులు ఏందిరా అయ్యా.. విడుదలకు ముందే మరీ ఇంత హైపా..
వైసీపీ అస్త్రం
వాస్తవానికి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి వైసీపీకి మరో అస్త్రం లేదు. అందుకే సుగాలి ప్రీతి కేసును తోడుతున్నారు. 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఏం చేయలేకపోయినా వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడదే కేసును పట్టుకుని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం విడ్డూరం. ప్రజలు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ, పూనమ్ కౌర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంకా ఇంకా ఈ కేసును వాడుకుంటున్నారంటూ షాకింగ్‌గా రియాక్టైంది.
#SugaliPreethiCase pic.twitter.com/eASs0ENXbp
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 30, 2025
న్యాయం లేకుండా శాంతి ఉండదు
పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో.. ‘‘ఒక బిడ్డపై అత్యాచారం జరిగి ఆమె చనిపోయినప్పుడు.. ఆ బిడ్డను కోల్పోయిన తల్లికి మనశ్శాంతిని ఇవ్వగలిగేది ఏదీ ఉండదు. ఏ సౌకర్యాలు ఆమెకు మనశ్శాంతి ఇవ్వలేవు. ఎన్ని ఉన్నా, తన బిడ్డ తన కళ్ల ముందు లేనప్పుడు ఆమె బతికి ఉన్నా చనిపోయినట్లుగానే భావిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ ఈ సంఘటనని అవకాశవాద మనస్తత్వాలు రాజకీయ దాడులు, ప్రయోజనాల కోసం వాడుకోవడమే. నేను న్యాయం కోసం ప్రార్థిస్తాను, ఎందుకంటే న్యాయం జరగకుండా శాంతి చేకూరదు. న్యాయం లేకుండా శాంతి ఉండదు’’ అని పేర్కొంది. ఇప్పుడీ ట్వీట్ బాగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు