– పత్తి విత్తనాల కోసం రైతుల క్యూ
– రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
– రద్దీ ఎక్కువగా ఉన్నచోట స్పెషల్ కౌంటర్లు
– విత్తనాల డిమాండ్ నేపథ్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం
Minister Thummala: తెలంగాణలో పత్తి విత్తనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో పలు జిల్లాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఒకే రకమైన విత్తనాల కోసం బారులు తీరడమే ఇందుకు కారణం. అలాగే, పచ్చి రొట్ట విత్తనాల కోసం కూడా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాల విక్రయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. విత్తనాల కోసం రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు తుమ్మల. విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్న ఆయన, జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఏ సమస్యా లేకుండా రైతులకు విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. అధికారులతోపాటు, కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల నుంచి విత్తనాల కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం అయ్యారు.
కొద్ది రోజులుగా పత్తి, పచ్చి రొట్ట విత్తనాల కోసం పలు జిల్లాల్లో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మల ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.