Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయం చేయడానికి వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతుగా రూ. 10 లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని వారు తమ భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్ తరపున అందజేశారు. తెలంగాణలో వర్షాల కారణంగా తీవ్ర నష్టం, కొన్ని చోట్ల ప్రాణ నష్టాలు సంభవించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి, బాధితులను ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి మద్దతుగా సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. ఆయన చూపిన ఈ గొప్ప మనసును, సామాజిక బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
Also Read- Vishal Engagement: ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
ఎప్పుడూ సినిమా వారే..
ఈ విరాళం బాధితులకు సహాయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి తిరిగి సాయం చేయాలనే సందీప్ రెడ్డి వంగా సంకల్పం చాలామందికి స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు, ఎటువంటి ఉపద్రవం వచ్చినా ముందు స్పందించేది సినిమా వాళ్లేనని మరోసారి సందీప్ రెడ్డి వంగా నిరూపించారు. ఇంతకు ముందు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సెలబ్రిటీలెందరో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలను అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్త వ్యస్తంగా మారింది. అధికారులు తమకు చేతనైనంతగా సాయం అందిస్తున్నా, నష్టం పూడ్చలేని విధంగా నదులు పొంగిపోర్లుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు సైతం నీట మునిగాయి.
సీఎం చొరవతో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వర్షాల ప్రభావంతో జరిగిన తీవ్ర నష్టాన్ని అంచనా వేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో అధికారులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన ఫుడ్, వాటర్, మెడిసిన్స్ అన్నీ అందేలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, ఎమ్మెల్యేలను, అధికారులను అలెర్ట్ చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే సందీప్ రెడ్డి వంగా రూ. 10 లక్షలు సీఎం సహాయనిధిగా విరాళంగా ప్రకటించడమే కాకుండా, చెక్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఆయన బాటలోనే ఇంకా సెలబ్రిటీలు ముందుకు వస్తారని ఆశిద్దాం.
‘స్పిరిట్’ చిత్రంతో బిజీ..
సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్యాస్టింగ్‌ను సెలక్ట్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు