Teachers Protest: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత ఉపాధ్యాయులు హనుమకొండలో వినూత్న నిరసనకు దిగారు. తమ సమస్యల గురించి ప్రస్తావిస్తూ గణపతికి వినతిపత్రం అందజేశారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకునేలా చూడు స్వామి అని వేడుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాన్ని కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే సొంత జిల్లాలకు తమను పంపేలా చూడాలని గణనాథుడ్ని వేడుకున్నారు.
‘హామీ ఇచ్చారు.. కానీ’
317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రాష్ట్ర నాయకులు కూరపాటి సత్య ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఈ జీవో వల్ల అనేకమంది టీచర్లు మానసికంగా కుంగిపోతున్నట్లు చెప్పారు. తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. 317 జీవో సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని సత్య ప్రకాష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న పట్టించుకోవడం లేదన్నారు.
Also Read: Plants: మనుషులకే కాదు.. మెుక్కలకూ ఆ ఫీలింగ్స్ ఉంటాయట.. అప్పుడవి ఏం చేస్తాయంటే?
‘మానసిక వేదనతో చనిపోతున్నారు’
ఇటీవలే తెలంగాణ హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడిన ఐఏఎస్ వాణి ప్రసాద్ ను స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసిందని సత్య ప్రకాష్ రావు గుర్తు చేశారు. దీని ఆధారంగా జీవో 317 బాధితులు అందరిని ‘స్థానికత’ ఆధారంగా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 317 జీవోతో మానసిక వేదనకు గురి అయ్యి ఇప్పటికే పలువురు మృత్యువు ఒడిలోకి చేరారని అన్నారు. అనేక మంది మానసిక వేదనకు గురి అవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
Also Read: Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!
‘ఇప్పటికైనా చర్యలు తీసుకోండి’
ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే స్పందించి 317 జీవో సమస్య పరిష్కారం చేసి సొంత జిల్లాలకు ఉద్యోగ ఉపాధ్యాయులను పంపించాలని సత్య ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. కాగా వినాయకుడికి వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో 317 జీ ఓ బాధిత ఉపాధ్యాయులు ఎ. శ్రీనివాస్, ఎన్. రమాదేవి, ఎన్. ఆగయ్య, డి.ఎల్లయ్య, ఎస్. రాజమౌళి పాల్గొన్నారు.