JubileeHills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మేయర్!
బీఆర్ఎస్ మహిళా అభ్యర్థికి ధీటుగా రంగంలోకి
ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక బరిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని దింపాలని అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీకి సిటీలో ప్రస్తుతం కంటోన్మెంట్ ఒక్క స్థానం మాత్రమే ఉండటంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహం సిద్దం చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే అధికార పార్టీ టికెట్‌ను ఆశిస్తూ అజారుద్దీన్, నవీన్ యాదవ్, మురళీ గౌడ్‌లు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని రంగంలో దింపే విషయంపై అధికార పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read Also- Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!
ముఖ్యంగా, గద్వాల్ విజయలక్ష్మి పదేళ్లుగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్‌గా వ్యవహారిస్తుండటంతో పాటు నాలుగున్నరేళ్ల క్రితమే ఆమె బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి, మేయర్ బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి నగరవాసులకు సుపరిచితమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఓటర్ల సానుభూతిని దక్కించుకునేందుకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యను బీఆర్ఎస్ రంగంలో దింపితే.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని అందుకు ధీటుగా పోటీలో నిలపాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also- Sports News: ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయినా, ఈ సీటును కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో అధికార పార్టీ ఇప్పటికే వ్యూహాలు మొదలుపెట్టింది. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులతో దూసుకెళుతోంది. అంతేగాక, పలువురు మంత్రులను ఇన్‌ఛార్జిలుగా నియమించి, రాజకీయాన్ని వేడెక్కించింది. పలువురు కీలక నాయకులను, నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న నేతలను పలు ప్రాంతాలకు ఇన్‌ఛార్జులుగా నియమించింది. అయినప్పటికీ నియోజకవర్గం ఓటర్లతో ఆశించిన స్థాయిలో కనెక్టివిటీ కాకపోవటానికి కారణాలను సైతం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు, మూడుసార్లు కార్పొరేటర్లుగా గెలిచి, స్థానికంగా మంచి పట్టున్న కార్పొరేటర్లను డివిజన్ల ఇన్‌ఛార్జులుగా, ఇప్పటికే ఉత్సాహాంగా పార్టీలో పని చేస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల వారీగా లోకల్‌గా పట్టున్న నేతలను ఎంపిక చేసి వారికి పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తే విజయం తేలిక అవుతుందని కూడా అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. బూత్ స్థాయి ఓటర్లను ఆకర్షితులను చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇలాంటి సూచనలు, సలహాలు చేసినట్లు సమాచారం. ఈ సూచనలు, సలహాలిచ్చినపుడు సిటీలో ప్రస్తుతం ఎమ్మెల్యేల కన్నా, ఉన్నతమైన మేయర్ హోదాలో ఉన్న గద్వాల్ విజయలక్ష్మినే బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న విషయంపై అధినాయకుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.