Palvancha Case: పాల్వంచ కేసు సంచలన మలుపు తిరిగింది. అక్రమ ఆయుధాలు తరలిస్తూ దొరికిపోయిన నిందితులు ముంబయికి చెందిన కరడుగట్టిన మాఫియా డాన్ రవి పూజారి గ్యాంగ్ సభ్యులని తేలింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Underworld don Dawood Ibrahim) గ్యాంగ్ తో వీరికి చాలా కాలంగా వార్ నడుస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అక్రమ ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా వెల్లడైంది. ఖమ్మం(Khammam) జిల్లా పాల్వంచ వద్ద ఇటీవల ఎక్సయిజ్ అధికారులు గంజాయి తరలిస్తున్న బిలాల్, శ్యాంసుందర్, కాశీనాధన్ సంతోష్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి 106 కిలోల గంజాయితోపాటు ఒక పిస్టల్, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు.
రెండు గ్యాంగుల మధ్య వార్
పెద్ద మొత్తంలో అక్రమ ఆయుధాలు పట్టుబడటంతో ఖమ్మం జిల్లా పోలీసులు కేసులో విచారణ చేపట్టారు. దీంట్లో పట్టుబడిన వారు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రత్యర్థి అయిన రవి పూజారి గ్యాంగ్ సభ్యులని వెల్లడైంది. కొంతకాలం క్రితం ఎన్ఐఏ అధికారులు రవి పూజారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను బెంగళూరు జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. అయితే, రెండు గ్యాంగుల మధ్య వార్ కొనసాగుతున్నట్టుగా విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే రవి పూజారి గ్యాంగ్ సభ్యులు అక్రమంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నుంచి ఆయుధాలను తరలించినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: HC on KCR’s Petition: కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురు.. విచారణ వాయిదా?
సిబ్బందికి క్యాష్ రివార్డులు
కరడుగట్టిన గ్యాంగ్ స్టర్లను అరెస్ట్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, సీఐ రమేశ్, ఎస్ఐ శ్రీహరి రావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ఏ.ఖరీం, జీ.బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, వెంకటేశ్వర్లు, వీరబాబు, విజయ్ కుమార్, ఉపేందర్, హన్మంతరావులను ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు. 50వేల రూపాయల క్యాష్ రివార్డుతోపాటు ప్రశంసా పత్రాలను అందించారు. ఇంతే అలర్ట్ గా ఉండి అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని సిబ్బందిని ఉద్దేశించి చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nandamuri Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్యకు చోటు.. ఎందుకంటే?