Gold Coins Scam: నలుగురు నిందితులను అరెస్ట్
సూర్యాపేటలో వెలుగుచూసిన ఘరానా మోసం
చివ్వెంల, స్వేచ్చ: కుండలో దొరికిన పురాతన బంగారు నాణేలు అమ్ముతామని నమ్మబలికి ఏకంగా రూ.20 లక్షలు మోసపూరితంగా దోచుకున్న నలుగురు నిందితులను చివ్వెంల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ.13.25 లక్షల నగదు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ సోమవారం సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు.తుమ్మలపెంపహాడ్ గ్రామానికి చెందిన నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యాపారిని నిందితులు ఏ1-పశుపుల గణేష్, ఏ2- ఓర్సు చంటి మాటలతో బోల్తా కొట్టించారు. దురాజ్ పల్లి గ్రామ శివారులో హోటల్ నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు వద్దకు ఇద్దరూ కలిసి వెళ్లి తమవద్ద పాత బంగారు నాణేలు ఉన్నాయని చెప్పారు. తక్కువ ధరకు అమ్ముతామని రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. 10వ తేదీన రూ.5 లక్షల బయానాగా తీసుకున్నారు. మళ్లీ మరునాడు రూ.15 లక్షల ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తర్వాత నాణేల ఇవ్వాలని అడగగా ఇవ్వకుండా విచిత్రమైన వీడియోలు పంపించి, గుర్తు తెలియని వ్యక్తులు తమ వద్ద డబ్బు దోచుకెళ్లారంటూ నమ్మించే ప్రయత్నం చేశారు.
మోసం జరిగిందని గుర్తించిన హోటల్ యజమాని వెంకటేశ్వర్… చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం నలుగురు నిందితులను దురాజ్ పల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.13.25 లక్షల నగదు రికవరీ చేశారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. దురాజ్‌పల్లి తెల్ల బండ కాలనీకి చెందిన పసుపులేటి నవీన్, ఓర్సు శీను, ఓర్సు గోపమ్మ , పసుపుల లక్ష్మీ, ముద్దంగుల అంజలి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Read Also- Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు
తీసుకున్న సొమ్ము వాటాలు
పురాతన కాలం నాటి కుండలో బంగారు నాణేలు లభించాయని అబద్ధపు కథను సృష్టించి, తక్కువ ధరకే వాటిని అమ్ముతామని నిందితులు నమ్మబలికారు. ఆగస్టు 10న బాధితుడి నుంచి రూ.5 లక్షలు, ఆగస్టు 11న రూ.15 లక్షలు వసూలు చేశారు. అనంతరం రెండు కోళ్లను కోసి వాటి రక్తాన్ని ఉపయోగించి గాయాలున్నట్లుగా నకిలీ వీడియో తీసి బాధితుడికి పంపించారు. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు దోచుకుపోయారంటూ నమ్మబలికారు. భయపెడుతూ ఫోన్‌పే ద్వారా అదనంగా రూ.10,000 వసూలు చేశారు. పసుపుల గణేష్ రూ.12.50 లక్షలు, ఓర్సు చంటి రూ.6 లక్షలు, ముద్దంగుల వెంకన్న రూ.1 లక్ష, పసుపుల సత్యం రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. గణేష్ వద్ద రూ.9.80 లక్షలు, చంటి వద్ద రూ.3.20 లక్షలు, వెంకన్న వద్ద రూ.25,000 స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వీడియో క్రియేట్ చేయడానికి ఉపయోగించిన వివో వై 75 మొబైల్ ఫోన్‌ను సాక్షుల సమక్షంలో పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
Read Also- Farmers Protest: నకిలీ ఎరువులు తీసుకొని కలెక్టరేట్‌కు వెళ్లిన రైతులు
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
పురాతన నాణేలు, ఖజానా, త్వరగా డబ్బులు వస్తాయంటూ ఎవరైనా నమ్మబలికితే మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ ఉన్నారు.
