Swathi Murder Case: స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు
ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు..
మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు
పోలీసులు నచ్చజెప్పటంతో స్వగ్రామానికి తరలింపు, అంత్యక్రియలు నిర్వహణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో (Swathi Murder Case) మేడిపల్లి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. హంతకుడు మహేందర్ రెడ్డి.. స్వాతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూసీ నదిలోకి విసిరేయటంతో వాటి కోసం సోమవారం హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు జరిపించారు. అయితే, మూసీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో స్వాతి శరీర భాగాలు లభ్యం కాలేదు. కాగా, స్వాతి శరీర భాగాలు దొరికే వరకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని, అంత్యక్రియలు జరిపేది లేదని ఆమె కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. తగు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసు అధికారులు నచ్చజెప్పటంతో సాయంత్రం స్వాతి మొండాన్నిస్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు.
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తన పొరుగింట్లో నివాసముంటున్న స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్ రెడ్డి ఆమె 5 నెలల గర్భిణి అని తెలిసినా కూడా కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తల, చేతులు, కాళ్లను ముక్కలు ముక్కలుగా చేశాడు. వీటిని ప్లాస్టిక్ కవర్లలో మూటగట్టి ప్రతాప సింగారం వద్ద మూసీ నదిలోకి విసిరేశాడు. ఆ తరువాత భార్య కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేయటానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. స్వాతి శరీర భాగాలను విసిరిన ప్రదేశానికి సోమవారం వెళ్లిన పోలీసులు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టారు. పాతాళ ఘడియ సహాయంతో ప్లాస్టిక్ కవర్లు విసిరేసిన చోట అంగుళం అంగుళం గాలించినా స్వాతి శరీర భాగాలు దొరకలేదు. మూసీ నది ఉధృతికి అవి కొట్టుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. అదే జరిగితే స్వాతి శరీర భాగాలను చేపలు తినేస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇదిలావుంచితే, శరీర భాగాలు లేని స్వాతి మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆమె కుటుబ సభ్యులు సోమవారం ఆందోళన జరిపారు. మొండానికి అంత్యక్రియలు చేయమని స్పష్టం చేశారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పారు. హత్యకు పాల్పడ్డ మహేందర్ రెడ్డి కఠిన శిక్ష పడేలా చూసి న్యాయం కల్పిస్తామన్నారు. దాంతో శాంతించిన స్వాతి కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఆమె మొండాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే, మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఊర్లోకి రానివ్వబోమని చెప్పారు. రావాలని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో కామారెడ్డిగూడలో అధికారులు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఇద్దరిది ఒకే ఊరు…
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామ వాస్తవ్యుడు సామల మహేందర్ రెడ్డి (27). స్వాతి ఎలియాస్ జ్యోతి (21)ది అదే గ్రామం. ఇరుగుపొరుగునే ఇండ్లు ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఉంది. స్వాతిని ఇష్టపడ్డ మహేందర్ రెడ్డి అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ప్రేమిస్తున్నాను…పెళ్లి చేసుకుందామన్నాడు. మొదట్లో ఇరువైపులా పెద్దలు వీరి వివాహానికి అంగీకరించ లేదు. అయితే, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని మహేందర్ రెడ్డి, స్వాతి మొండి పట్టు పట్టటంతో చివరకు ఒప్పుకొన్న పెద్దలు 2024, జనవరి 20న కూకట్ పల్లి ఆర్య సమాజ్ లో ఇద్దరికి వివాహం జరిపించారు. ఆ తరువాత బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ ప్రాంతంలోని శ్రీనివాస్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. స్వాతి పంజగుట్టలోని ఎబెక్స్ కాల్ సెంటర్ లో ఉద్యోగంలో చేరగా మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్ గా పని చేయటం ప్రారంభించాడు.
పెళ్లయిన నెల రోజుల నుంచే..
వివాహమైన తరువాత మొదటి నెల వీరి కాపురం ఆనందంగానే సాగింది. కాగా, స్వాతి కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుండటం…తరచూ ఫోన్లు మాట్లాడుతుండటంతో మహేందర్ రెడ్డిలో అనుమాన బీజాలను నాటాయి. ఈ క్రమంలో ఆమెను అనుమానించటం మొదలు పెట్టిన మహేందర్ రెడ్డి చిన్న చిన్న విషయాలపై కూడా స్వాతితో గొడవలు పెట్టుకోవటం ప్రారంభించాడు. స్వాతితో ఉద్యోగం కూడా మానిపించేశాడు. ఆ తరువాత భార్యను తీసుకుని ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా స్వాతితో గొడవలు పడటాన్ని కొనసాగించాడు. నానాటికీ మహేందర్ రెడ్డి వేధింపులు ఎక్కువ అయిపోవటంతో భరించలేక పోయిన స్వాతి పెళ్లయిన మూడు నెలలకే వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, గ్రామ పెద్దలు పంచాయితీ జరిపి ఇద్దరికి నచ్చజెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది. ఆ తరువాత రెండు నెలలకు మళ్లీ శ్రీనివాస్ నగర్ కు వచ్చి అంతకు ముందు ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్వాతి మార్చి నెలలో గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భిణి. అయితే, భార్య గర్భం దాల్చిన తరువాత మహేందర్ రెడ్డిలో అనుమానం పెరిగి పెద్దదై పెనుభూతంలా మారింది. కాగా, శుక్రవారం స్వాతి తాను ఈనెల 27న ఊరికి వెళతానని మహేందర్ రెడ్డితో చెప్పింది. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత పుట్టింటికి పోతానని తెలిపింది. దీనికి మహేందర్ రెడ్డి అంగీకరించ లేదు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడే మహేందర్ రెడ్డి ఎలాగైనా సరే స్వాతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
రంపం కొని…
దీని కోసం రూపొందించుకున్న పథకం ప్రకారం మహేందర్ రెడ్డి బోడుప్పల్ లోని ఓ షాపు నుంచి గ్రిప్ యాక్సా బ్లేడ్ (రంపం) కొని తెచ్చి ఇంట్లో పెట్టాడు. శనివారం ఇంటి యజమాని కుటుంబం బయటకు వెళ్లటంతో అదే అదునుగా భావించి స్వాతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత తల, చేతులు, కాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ప్రతాప సింగారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిలోకి విసిరేశాడు. ఛాతీ భాగాన్ని ఏం చేయాలో అర్థంగాక ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ తరువాత బంధువుతో కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భార్యకనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అయితే, శ్రీనివాస్ నగర్ మేడిపల్లి స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ కంప్లయింట్ ఇవ్వాలని ఉప్పల్ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి బంధువుతో కలిసి మేడిపల్లి స్టేషన్ కు వెళ్లాడు. అయితే, మహేందర్ రెడ్డి వాలకంపై అనుమానం వచ్చిన మేడపల్లి సీఐ గోవింద రెడ్డి, ఎస్ఐ నర్సింగ్ రావులు నిశితంగా ప్రశ్నించగా మహేందర్ రెడ్డి చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని ఇంటి నుంచి స్వాతి మృతదేహంలోని ఛాతీ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూసీలోకి విసిరేసిన మిగితా శరీర అవయవాల కోసం గాలింపు జరిపినా దొరకలేదు. గాలింపును కొనసాగిస్తామని డీసీపీ పద్మజ చెప్పారు. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున విచారణను కొనసాగించనున్నట్టు తెలిపారు.