Cyber Criminals: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు వెల్లడి
టేకులపల్లి, స్వేచ్ఛ: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మంది వ్యక్తులను (Cyber Criminals) అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. గత 2 రోజుల క్రితం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) ద్వారా జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదులు అందాయన్నారు. వాటి ఆధారంగా టేకులపల్లి పోలీసులు, జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం మధ్యాహ్నం సమయంలో టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.
టేకులపల్లిలో మీసేవా కేంద్రాన్ని నడిపిస్తున్న బోడ శ్రీధర్, టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు, ఇతర వ్యక్తులకు నగదును బదిలీ చేస్తే కమిషన్ ఇస్తామంటూ చెప్పారని నిందిత యువకులు తెలిపారు. టేకులపల్లి మండలానికి చెందిన మరో 12 మంది యువకులు నకిలీ పత్రాలతో 60 అకౌంట్లు తెరిచి ఇతరుల బ్యాంకు ఖాతాలలోకి నగదును పంపించేవారని ఎస్పీ వివరించారు. సైబర్ నేరగాళ్లు 13 మంది వ్యక్తులకు కమిషన్లు ఇస్తూ నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. గత ఆరు నెలలుగా రూ. 8.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. నిందిత వ్యక్తుల నుంచి 12 సెల్‌ఫోన్లు, ఓ బ్యాంకు పాస్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
Read also- Women Suicide: ఖమ్మం యువతి.. వైజాగ్‌లో ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
నిందితుల వివరాలు
బోడ శ్రీధర్, రాజేష్, రాజన్న, బానోత్ జగదీష్, తేజావత్ నరేష్, పోలే పొంగు పవన్ కళ్యాణ్, భూక్యా వీరన్న, జాటోత్ నరేష్, బోడ జంపన్న, రాజారాం, భూక్య ప్రవీణ్, మాలోత్ ప్రవీణ్, ఉరి మల్ల భరత్ కృష్ణ లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. సైబర్ నేరాలకు గురైనట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం చేయడానికి వీలవుతుందని ఆయన సూచన చేశారు.
Read Also- Nagarkurnool: విహరిద్దామని భార్యను తీసుకెళ్లి.. నల్లమలలో సైలెంట్‌గా తగలబెట్టేశాడు!
39 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి
ఖమ్మం, స్వేచ్ఛ: పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించి నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగన్నతి పొందిన కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆయన పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 39 మంది పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో 22 మంది మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు, 13 మంది భద్రాద్రి కొత్తగూడెం, ఒకరు ఖమ్మం జిల్లాకు చెందినవారు ఉన్నారు. ముగ్గురు ఇతర విభాగాలకు కేటాయించి బదిలీ చేశారు.
