Women Suicide: ఖమ్మం, స్వేచ్ఛ: ప్రేమ పేరుతో మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, ఇతర పరిచయాలతో దగ్గరవుతున్నారు. ప్రేమ, దోమ అంటూ తిరుగుతున్నారు. కానీ, కొందరు వ్యక్తులు ప్రేమించినవారిని వంచిస్తున్నారు. ఉన్నపలంగా వదిలేస్తున్నారు. పర్యావసానంగా, మోసపోయామని గ్రహించి కొందరు మానసికంగా జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యకు (Women Suicide) కూడా పాల్పడుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
వైజాగ్‌లో ఖమ్మం యువతి సూసైడ్
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన ఓ యువతి విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యువతి గ్రామానికే చెందిన నరేశ్ అనే యువకుడికి ఇదివరకే పెళ్లి అయింది. అయినప్పటికీ వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఇటీవల రాఖీ పండుగ తర్వాత హైదరాబాద్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వైజాగ్ వెళ్లారు. నగరంలోని టూటౌన్ పరిధిలోకి వచ్చే ఓ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని నివాసం పెట్టారు. ఈ క్రమంలో నరేశ్, ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో, తీవ్ర మనస్థాపానికి గురై ఆ యువతి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన ఘటన ఏంటంటే, నరేశ్ కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులు ఇదివరకే తిరుమలాయపాలెం పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ విషయాన్ని ఎస్సై కూచిపూడి జగదీశ్ వెల్లడించారు.
Read Also- ACB officials: అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ..
ఆత్మహత్యలొద్దు
సమస్య ఎలాంటిదైనా ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయ్, కానీ అవన్నీ తాత్కాలికమే. ఆ క్షణంలో దురవస్థగా అనిపించిన సమస్య కూడా, కొన్నాళ్ల తర్వాత చిన్నదిగా మారిపోతుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం కచ్చితంగా ఉంటుంది. సహాయం కోసం ఆశ్రయించడంలో తప్పేమీ లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు లేదా కౌన్సిలర్లతో మాట్లాడండి. భావాలను పంచుకొని పరిష్కారాన్ని అన్వేషించండి. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనది. బాధను తట్టుకోలేనప్పుడు, ధైర్యం చేసి దానిని పంచుకోండి. చనువుగా ఉండే వ్యక్తులకు ఒక మెసేజ్, ఒక కాల్, ఒక మాట చెబితే జీవితాన్ని మార్చేస్తాయేమో చెప్పలేం కదా!. దయచేసి ఆత్మహత్య అనే ఆలోచనను మనసులోకి రానివ్వకండి అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే,సమీప మానసిక సహాయ హెల్ప్‌లైన్ నంబర్లు లేదా కౌన్సిలింగ్ సెంటర్లను సంప్రదించడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు.
Read Also- Nara Lokesh: స్త్రీ శక్తికి కొత్త శక్తి.. ర్యాపిడోతో రాణిస్తున్న మహిళ.. నారా లోకేషే ఫిదా అయ్యారు!