Meenakshi Natarajan: దేశంలో పౌరుల ఓటు చోరీ చేసి భాజపా అధికారంలోకి వచ్చింది
మండిపడిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్
స్వేచ్ఛ, మేడ్చల్: ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపి, ఓట్ చోరీ వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు ఓట్లను చోరీ చేసి భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
Read Also- Jangaon district: సర్కారు సాయంతో సోలారు వెలుగులు.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
ఓటు చోరీ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ వ్యతిరేక కార్యక్రమానికి మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.
Read Also- Ganesh Chaturthi: పర్యావరణహిత వినాయక చవితి జరపండి.. జన విజ్ఞాన వేదిక సూచన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని మీనాక్షి నటరాజన్ అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాలన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్వర్యంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఓటు చోరీపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్దన్ రెడ్డి ఓటు చోరీపై అవగాహన కల్పించేందుకు 5 వాహనాలను డిజిటల్ స్క్రీన్లతో ప్రత్యేకంగా కేటాయించడం అభినందనీయమన్నారు. అంతకుముందు నూతన జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఆయా నియోజకవర్గ ఇంఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.