– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు రావాలని కోరాను
– ఉద్యమకారులనూ ఆహ్వానిస్తున్నాం: సీఎం
CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనాయకులను, ఉద్యమకారులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని ఇది వరకే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా సోనియమ్మను ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా గాంధీ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. వేడులకు ఏర్పాట్లు కూడా అంతే హుషారుగా సాగుతున్నాయి.
తమ ఆహ్వానాన్ని అంగీకరించి తెలంగాణకు రావడానికి ఒప్పుకున్న సోనియా గాంధీకి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తామని, ఈ జాబితా రూపొందించే బాధ్యతను కోదండరామ్‌కు అప్పగించామని వివరించారు. తమ ప్రభుత్వం ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు.