Vishal 35 Movie: తెలుగమ్మాయ్ అంజలి (Anjali) మరోసారి హీరో విశాల్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం అంజలి చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న విషయం తెలియంది కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాలో అంజలి పోషించిన పాత్రకు అవార్డ్ వస్తుందని, విడుదలకు ముందు చిత్ర టీమ్ ప్రకటించింది. సినిమా విడుదల తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా, ఆమె పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక అవార్డు సంగతి పక్కన పెడితే.. ఆ సినిమా తర్వాత ఆమె ఏ సినిమాలో చేస్తుందనే క్లారిటీ లేదు. మధ్యలో రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారికంగా.. హీరో విశాల్ 35వ (Vishal35) ప్రాజెక్ట్‌లో అంజలి నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తున్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టారు. ఆయన హీరోగా నటించిన ‘మద గద రాజా’ చిత్రం చాలా ఏళ్ల తర్వాత ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ సరసన హీరోయిన్లుగా నటించారు. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతుండటంతో.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఈ సంస్థకు 99వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అంజలి కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆమె ఆల్రెడీ షూట్‌లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య, మణిమారన్, వెంకట్ మోహన్, శరవణన్, కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, పంపిణీదారు తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాలకు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంజలితో పాటు విశాల్ సరసన దుషార విజయన్ కూడా మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా, దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. ‘మార్క్ ఆంటోనీ’ తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. రవి అరసు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపు కుంటోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు