– ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్, హరీష్ ఎందుకు స్పందించరు?
– బండి సంజయ్ మౌనం వెనుక కారణాలేంటి?
– నా ఫోన్ ట్యాప్ చేశారని తెలిసి ఎంతో బాధపడ్డా
– నా భార్యతో మాట్లాడిన మాటలు కూడా బహిర్గతమయ్యాయి
– దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తా- కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ
BRS Leaders: ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. వారి కన్ఫెషన్ రిపోర్టుల్లో అన్నీ బహిర్గతం అవుతున్నాయి. బాధితుల వివరాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే.
తాజాగా ఆయన మాట్లాడుతూ, తన ఫోన్ ట్యాప్ అయిందని రాధాకిషన్ రావు చెప్పారని అన్నారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఇది నీచాతి నీచమైన చర్యగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాప్ చేయడానికి తానేమైనా తీవ్రవాదినా అంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వలన తనకు అత్యంత దగ్గరి వ్యక్తి, పర్సనల్ అసిస్టెంట్‌ని దూరం చేసుకున్నానని అన్నారు. పదేండ్లు పాలించిన కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ వలన తెలంగాణ రాష్ర్ట్రానికి అపవాదు తీసుకువచ్చారని విమర్శించారు. బీజేపీ నేత బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయిందని తెలిసినా ఇంత వరకూ ఎందుకు స్పందిచలేదని ఈ సందర్భంగా మండిపడ్డారు సత్యనారాయణ.
తన ఫోన్‌ను ట్యాప్ చేయడంపై హైకోర్టుని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీ విజిల్ యాప్‌లో బీఆర్ఎస్ నేతల ఇండ్లలో డబ్బులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, తన భార్యతో మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ వలన బహిర్గతం అయ్యాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసిందని, కానీ, ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి తనను గెలిపించారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు స్పందించడం లేదని కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు.