– రాష్ట్ర అధికారిక గేయంపై వివాదం
– కీరవాణి స్వరకల్పనపై బీఆర్ఎస్ అభ్యంతరం
– ఆంధ్రా వాళ్లను నెత్తిన పెట్టుకున్నది కేసీఆర్ కాదా?
– చినజీయర్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి ఎవరు?
– జగన్‌తో కలిసి కుట్రలు చేసిందెవరు?
– మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు
Jaya Jayahe: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక రణనినాదంగా పనిచేసింది అందెశ్రీ రాసిన పాట ‘జయ జయహే తెలంగాణ’. దీన్ని రాష్ట్ర అధికారిక గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత ఈ పాట రాష్ట్ర గేయంగా మారింది. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన ఒక కొత్త బాణీతో ఈ పాటను ముందుకు తీసుకురానున్నారు. ఇందుకు గీత రచయిత అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు.
అందెశ్రీ కి పూర్తి స్వేచ్ఛ.. బీఆర్ఎస్ విమర్శలు
అందెశ్రీ ఎంపిక మేరకు జయ జయహే పాటకు కొత్త ట్యూన్‌ను కట్టే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణికి అప్పగించారు. అయితే, తెలంగాణ అధికారిక గేయం జయ జయహే పాటకు ఆంధ్రా వ్యక్తి స్వరకల్పన చేయడం ఏంటి అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఆంధ్రా సంగీత దర్శకుల పెత్తనం ఏంటి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద పోస్టే పెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఘాటుఘాటుగా కామెంట్లు వస్తున్నాయి.
అప్పట్లో కేసీఆర్ చేసిందేంటి?
రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ వర్గాలకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గత పాలనలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు హస్తం శ్రేణులు. గోదావరి జిల్లాకు చెందిన చినజీయర్ స్వామిని తెలంగాణకు తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఈ తప్పు కనిపించలేదా? యాదగిరి గుట్ట గుడి పునరుద్ధరణకు ఆనంద సాయితో డిజైన్‌ను రూపొందించినప్పుడూ సోయి లేదా? అని బీఆర్ఎస్‌పై విమర్శలు వస్తున్నాయి. లక్ష కోట్ల కాళేశ్వరం కాంట్రాక్టును ఆంధ్రాకు చెందిన మేఘా కృష్ణారెడ్డికి కట్టబెట్టి, బ్యారేజ్ సైట్ దగ్గర శాలువాలు కప్పి మరీ సన్మానించినప్పుడు ఆయన ఏపీ వ్యక్తి అని మర్చిపోయారా? స్పెషల్ ఫ్లైట్‌లో ఆంధ్రా వెళ్లి కృష్ణా నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించినప్పుడు సోయిలో లేరా? అని కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు హస్తం నేతలు. భారత దేశ కీర్తిని, తెలుగుజాతి గొప్పతనాన్ని విశ్వ యవనికపై ఎగరేసి ఆస్కార్ అవార్డు సాధించిన కీరవాణి రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చడం తప్పు అనడం విడ్డూరంగా ఉన్నదని అంటున్నారు. కీరవాణి గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారని, ఆ మాటకొస్తే బిహార్ మూలాలు ఉన్న కేసీఆర్ తెలంగాణను పాలిస్తే తప్పు లేదంటారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
పదేళ్లు అధికారిక గేయం కోసం ఏం చేశారు?
ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఉద్యమకారుల గుండెచప్పుడుగా సాగిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక పాటగా ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. తెలంగాణకు అధికారిక గేయం లేదని స్వయంగా కేసీఆరే ఓసారి వెల్లడించారు. అంతేనా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాటంలో అందరి భావోద్వేగాలను కలిపిన జయ జయహే పాట రచయిత అందెశ్రీకి కనీస గౌరవం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఎంఎం కీరవాణికి ట్యూన్ కట్టే బాధ్యతను అప్పగించడంపై అందెశ్రీకి లేని అభ్యంతరం వేరేవారికి ఎందుకు అని కొందరు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. పాట రాసిన అందెశ్రీ నికార్సైన తెలంగాణవాది అని, కానీ, పదేళ్లు కనీస గుర్తింపు కూడా దక్కనివ్వనివారు ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడేస్తున్నారని విమర్శిస్తున్నారు.
సమంత, పుల్లెల గోపీచంద్, మంచు లక్ష్మి ఎవరు?
జరుగుతున్న వివాదంపై గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. కీరవాణి ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ అని, ఆయన జయ జయహే పాటకు స్వరకల్పన చేయడం గర్వకారణం కాదా అని అన్నారు. పాటని ఎవరితో కంపోజ్ చేయాలి అనే విషయంలో అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వివరించారు. ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నవారు, గతంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సమంత, పుల్లెల గోపీచంద్, మంచు లక్ష్మీలకు కేసీఆర్ అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్లు ఆంధ్రా వాళ్లు అని గుర్తుకు రాలేదా? అని అడిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుండు చేయించుకున్నంత మాత్రాన బుద్ధిస్ట్ లేదా అంబేద్కరిస్ట్ కాలేరని విమర్శించారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ పోదామన్న ప్రవీణ్ కుమార్ ఎక్కడకు పోయాడు, ఏనుగు ఎక్కడకు పోయింది అని ప్రశ్నించారు.