Rajiv Gandhi Civils Abhaya Hastham: దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలుగా సివిల్ సర్వీసెస్ (Civil Services)ను చెబుతుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత.. యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో పోటీ పడుతుంటారు. తెలంగాణ నుంచి సైతం పలువురు అభ్యర్థులు సివిల్స్ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఈ పరీక్షకు సిద్ధం కావడం.. ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నది. దీంతో అంత స్తోమత లేని వేలాది మంది విద్యార్థులు సివిల్స్ సాధించాలన్న తమ కోరికను చంపుకుంటున్నారు. దీనిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt).. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హత కలిగిన వారికి రూ.లక్ష సాయం అందిస్తోంది. కాబట్టి ఈ స్కీమ్ కు సంబంధించి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కీమ్‌ను ఎప్పుడు ప్రారంభించారంటే?
2024 జూలై 20న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్ (Rajiv Gandhi Civils Abhaya Hastham) ను ప్రారంభించారు. రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన అభ్యర్థులు.. సివిల్స్ పరీక్షలో విజయం సాధించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఈ స్కీమ్ ద్వారా అందజేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు.. ఈ స్కీమ్ కు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
ఆర్థిక సహాయం
సివిల్స్ అభయ హస్తం కింద ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇందుకోసం ఆ అభ్యర్థి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్ కు ప్రిపేర్ అవ్వడం కోసం ప్రభుత్వం ఈ రూ. లక్ష అందించనుంది. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించిన అభ్యర్థులకు అదనంగా మరో రూ.1 లక్ష సహాయం ఇవ్వనుంది. ఈ సహాయం సింగరేణి కోలియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా అందించబడుతుంది.
అర్హత ప్రమాణాలు
ఈ స్కీమ్ కింద అభ్యర్థికి కొన్ని అర్హతలను ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసి అయి ఉండాలి. SC, ST, OBC, EWC కేటగిరికి చెంది ఉండి.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాలం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అభ్యర్థి UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అవసరమైన పత్రాలు
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్ కు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే
❄️ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
❄️ స్కాన్ చేసిన సంతకం
❄️ UPSC ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు ఫారం
❄️ UPSC ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డ్
❄️ ఆధార్ కార్డ్
❄️ బ్యాంక్ ఖాతా వివరాలు
❄️ తెలంగాణ డొమిసైల్ సర్టిఫికేట్
❄️ ఆదాయ ధృవీకరణ పత్రం
❄️ కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC/EWS)
దరఖాస్తు ప్రక్రియ
1. సింగరేణి కోలియరీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.scclmines.com ను సందర్శించండి:
2. హోమ్‌పేజీలో “Apply Now” ఎంపికపై క్లిక్ చేయండి.
3. అవసరమైన వివరాలను (పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మొదలైనవి) నమోదు చేయండి.
4. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు ఫారాన్ని సమీక్షించిన తర్వాత ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
5. దరఖాస్తు సమర్పణ తర్వాత, అధికారులు పత్రాలను ధృవీకరిస్తారు, మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ప్రచురించబడుతుంది.
6. ఆర్థిక సహాయం నేరుగా అభ్యర్థి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
2024లో 140 మందికి లబ్ది..
ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే (2024)లో గణనీయమైన స్పందన లభించింది. 140 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి రూ.1 లక్ష సహాయం పొందారు. వీరిలో వీరిలో 20 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా.. అందులో 7 మంది సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం అందించిన రూ.లక్ష సాయం తమ కోచింగ్ ఫీజులు, బుక్స్, ఇతర ఖర్చులు ఉపయోగడపడ్డాయని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: SC on Stray Dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు.. ఈసారి ఏం చెప్పిందంటే?
సంప్రదింపు వివరాలు
❄️ హెల్ప్‌లైన్ నంబర్: 08744 243163
❄️ ఈమెయిల్: per_ee@scclmines.com (mailto:_ee@scclmines.com)
❄️ అధికారిక వెబ్‌సైట్: www.scclmines.com
గమనిక: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం స్కీమ్.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత అందుబాటులోకి వస్తుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు.