Protest In Tirumala: సమస్యల పరిష్కారంకై శ్రీవారి మెట్టు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు నేటికి ఏడాది పూర్తి చేసుకున్నాయి. తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా కొనసాగుతున్న ఈ దీక్షలు 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు వ్యాపారులు నేడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమలేశుడా! మాకు న్యాయం చెయ్యాలని కోరుతూ చిరు వ్యాపారుల కుటుంబాలు శ్రీవారికి సామూహికంగా తలనీలాలు సమర్పించాయి. తిరుమలేశుని నిలువెత్తు చిత్రపటం ముందు గోవింద నామ స్మరణలు చేస్తూ, న్యాయం చేయమని టీటీడీకి విజ్ఞప్తులు చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తిరునామాలు ధరించి చిరు వ్యాపారులు గోవిందుని స్మరణ చేశారు. తలనీలాలు సమర్పించిన అనంతరం కపిలతీర్థం కు వెళ్లి స్నానాలు ఆచరించారు.
ఏడాది పూర్తయినా కనికరం లేదా
దీక్షలు చేపట్టి ఏడాది పూర్తయినా టీటీడీ(TTD) యాజమాన్యానికి చిరు వ్యాపారుల పట్ల కనికరం ఏర్పడకపోవటానికి కారణం ఏమిటో చెప్పాలని శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ గౌరవాధ్యక్షులు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి(Murali) డిమాండ్ చేశారు. శ్రీవారి మెట్టు వ్యాపారుల శిబిరం ఎదురుగా జరిగిన సభను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. ప్రభుత్వాలు మారుతున్నా సామాన్యుడికి టీటీడీ(TTD)లో న్యాయం అందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ కారణాలతో
పలుమార్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu), ఈవో శ్యామలరావు(EO Shyamala Rao), అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలను కలిసినా, పలుమార్లు చర్చలు జరిపినా ఏడాదికాలంగా పేదల సమస్యని ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో సమస్యను పరిష్కరించకపోవడం సమంజసం కాదని మురళి అన్నారు. పేదలు చేపట్టిన ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన మానవతావాదులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రోజురోజుకు పోరాటం మరింత ఉధృతం అవుతుందని, కూటమి ప్రభుత్వ పెద్దల గౌరవం పలుచబడక ముందే సామరస్యంగా సమస్యను పరిష్కరించటం సమంజసంగా ఉంటుందని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.
Also Read: Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు ‘రాజీవ్ యువవికాసం’ అమలు అప్పుడేనా!
చిరు వ్యాపారులు బంగారు కుటుంబాలు కాదా
పీ4 పథకం పేరిట చంద్రబాబు బంగారు కుటుంబాలను ఆదుకుంటామని చేస్తున్న ప్రకటనలలో వాస్తవం ఎంతో ఇలాంటి ఘటనల వల్ల అర్థమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. బంగారు కుటుంబాల పేరిట పేదలను ధనవంతులను చేయటానికి చంద్రబాబు చేస్తున్న కృషి నిజమైనదైతే ఇప్పటికే శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులను దత్తత తీసుకుని ఉండేవారని అన్నారు. ఏడాదికాలంగా మొక్కవోని దీక్షతో పోరాడుతున్న వ్యాపారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సభా కార్యక్రమంలో సీఐటీయూ నేతలు టి. సుబ్రహ్మణ్యం, ఆర్. లక్ష్మి, కె వేణుగోపాల్, మాధవ్, బుజ్జి, తంజావూరు మురళి, రవి, మారి ముత్తు తదితరులతోపాటు ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి ప్రసంగిస్తూ మద్దతు ప్రకటించారు..కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ నాయకులు మధు, చిట్టిబాబు, యుగంధర్, గణేష్, రాంబాబు రామ్మూర్తి, మల్లి, నరసింహులు, ప్రకాష్, సోనూ, పెంచలయ్య, మునయ్య, చిరంజీవి, శేఖర్ తదితరులతో పాటు చిరు వ్యాపారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.
Also Read: Ram Charan: నెవర్ బిఫోర్ లుక్‌లో.. ‘పెద్ది’ సర్‌ప్రైజ్‌కు సిద్ధమా!