Mirai Movie: ‘హను మాన్’ (Hanu Man) సినిమాతో సూపర్ హీరో క్రేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మిరాయ్’ (Mirai). ఇందులో తేజ సజ్జా సూపర్ యోధగా కనిపించనుండగా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వచ్చిన గ్లింప్స్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అలాగే, ఈ సినిమా అన్ని ఏరియాలలో బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. టేబుల్ ప్రాఫిట్‌తో నిర్మాత ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ‘బాహుబలి’ హిందీలో విడుదల చేసిన ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమా ఒక్కసారిగా వార్తలలో హైలెట్ అవుతోంది.
అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ రీసెంట్‌గా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ విషయంలో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను ఒక వారం పాటు వాయిదా వేస్తున్నారనేలా టాక్ మొదలైంది. సెప్టెంబర్ 5న అనుష్క ‘ఘాటి’తో పాటు మరో నాలుగైదు సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ సినిమా సోలో రిలీజ్ కోసం మేకర్స్ సెప్టెంబర్ 12కు వెళ్లినట్లుగా టాక్ నడుస్తుంది. అదే నిజమైతే మాత్రం అనుష్క ‘ఘాటి’ (Anushka Ghaati Movie)కి లైన్ క్లియర్ అయినట్లే. అయితే, మేకర్స్ మాత్రం రిలీజ్ వాయిదాపై ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ సినిమా ఆల్రెడీ అన్నివైపులా లాక్ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడటం అనేది జరగదనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read- Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. ఆ గుడి పూజారులు బయటకు నెట్టేశారు
‘మిరాయ్’ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని, ప్రస్తుతం నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 38 కోట్లకు అమ్ముడయ్యాయనేలా టాక్ నడుస్తుంది. ‘హనుమాన్’కు వచ్చిన క్రేజ్‌తో ఈ సినిమా కూడా భారీగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందని అంతా భావిస్తున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2D, 3D ఫార్మాట్‌లలో మొత్తం ఎనిమిది భాషల్లో విడుదలకానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు