KTR on Congress: సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు సోమవారం ధర్నా చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వ పాలనకు నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. వేలకోట్ల రూపాయల ముడుపుల కోసం బడా కాంట్రాక్టర్లకు, క్యాబినెట్‌లోని మంత్రుల కంపెనీలకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ముడుపులు ఇవ్వడం లేదన్న కారణంతో చిన్న కాంట్రాక్టర్లను ముప్పు తిప్పలు పెడుతుందని విమర్శించారు.
సీఎం కార్యాలయం ఎదుటే ధర్నా
గతంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల నిరసనలు, సీఎం కార్యాలయం(CM’s Office) ఎదుటే ధర్నా కాంగ్రెస్ సర్కార్ పాలనను తేటతెల్లం చేస్తున్నదన్నారు. 20 శాతం కమిషన్లు ఇవ్వలేని చిన్న కాంట్రాక్టర్లు చివరకు ప్రభుత్వ సచివాలయంలో ధర్నాకు దిగడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పాలనకు నిదర్శనం అన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి వంటి ప్రజా సంక్షేమ పథకాలపై పని చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం సరికాదన్నారు.
ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల కోసం కాంట్రాక్టు చేసిన చిన్న కాంట్రాక్టులను పక్కనపెట్టి బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తుందని మండిపడ్డారు. 20 నెలల పాలనలోనే 2.20 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, 420 ఎన్నికల హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా లక్షల కోట్ల రూపాయలను ఏం చేసిందని ప్రశ్నించారు. తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోతే బాధిత కాంట్రాక్టర్లతో కలిసి బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.
సర్కార్ అసమర్థతతోనే తరలిపోతున్న పరిశ్రమలు గుజరాత్‌కు తరలిన రూ.2,800 కోట్ల ‘కేన్స్’ పెట్టుబడి
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతో శ్రమించి రాష్ట్రానికి తీసుకొచ్చిన రూ.2,800 కోట్ల పెట్టుబడి, 2వేల ఉద్యోగాల సామర్థ్యం గల ‘కేన్స్’ టెక్నాలజీ సెమీకండక్టర్ల పరిశ్రమ కాంగ్రెస్ సర్కార్ అసమర్థత కారణంగా గుజరాత్‌కు తరలిపోవడం అత్యంత బాధాకరమన్నారు. వరుసగా పరిశ్రమలు తరలిపోతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలన కారణంగానే రాష్ట్రం విడిచి కంపెనీ వెళ్లిపోయిందని విమర్శించారు.
Also Read: Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం