Jaggareddy: భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మాట్లాడుతూ తొలి ప్రధాని సేవలను కొనియాడారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలోని పరిస్థితులు వేరు అని, అప్పుడు దేశంలో గుండుసూది కూడా ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేవని వివరించారు. అప్పుడు జనాభా 40 కోట్లు అని, జనాభా తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులు సరిపడా లేవని తెలిపారు. ఆ తక్కువ జనాభాకూ సరిపడా ఆహార ధాన్యాల అందేవి కాదని వివరించారు. ఆహార ధాన్యాలు లేకపోవడం అప్పుడు పెద్ద సవాల్ అని, ఆ సవాల్‌ను మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విజయవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. దేశ గతిని మార్చి ప్రగతి పథంలో నడిపించారని వివరించారు.
నెహ్రూ విలాసవంతమైన జీవితం గడిపారని కొందరు గాలి మాటలు చెబుతారని, కానీ, వాస్తవానికి ఆయన పదహారేళ్లు జైలు జీవితం గడిపారని జగ్గారెడ్డి వివరించారు. అప్పట్లో కరెంట్, సాగు నీటి ప్రాజెక్టులు లేవని, ప్రజలకు మూడు పూటలా భోజనం అందాలంటే ఈ మౌలిక సదుపాయాల ద్వారా పంట పండించడం అవసరం నెహ్రూ గుర్తించారని చెప్పారు. అంతేకాదు, అందరికీ ఆహార ధాన్యాలు అందించి ఆకలి చావులకు అడ్డుకట్ట వేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసుకునే ఉపాయాన్ని ఆలోచించి అమలు చేశారని వివరించారు.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి.. సాగు నీటి ప్రాజెక్టులను జవహర్ లాల్ నెహ్రూ నిర్మించారని, ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులతో సాగుకు నీరు అందించారని, విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులనూ నిర్మించారని వివరించారు. ఇప్పుడు ఘనత వహిస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రధాని మోదీ ఒక్క సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణమైనా చేపట్టారా? బీజేపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు తాగు నీటి కొరత రావొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం మంజీర జలాశయాన్ని నిర్మించిందని, కాంగ్రెస్ హయాంలో నిర్మితమైన డ్యాం నీళ్లను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు తాగి పెరిగారని వివరించారు. ఈ మంజీర నీటిని కిషన్ రెడ్డి తాగలేదా? అని అడిగారు. మళ్లీ అదే నోటితో కాంగ్రెస్ ఏం చేయలేదని ఎలా అంటారు? అని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని వివరించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని, కేసీఆర్ భూములను అమ్మారని అన్నారు.