GHMC: నెలకు రూ.300 కోట్లు వసూళ్ల లక్ష్యం
ట్యాక్స్ సిబ్బందికి టార్గెట్లు నిర్దేశించిన హైదరాబాద్ నగర పాలక సంస్థ
రూ.1,700 కోట్లు దాటిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర పన్ను వసూళ్లు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో అతిపెద్ద స్థానిక సంస్థగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. అంచనాలకు తగ్గట్టు పన్ను రాబడులు లేకపోవడంతో పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. అందుకే, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చుకునేందుకు పన్ను వసూళ్లపూనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ప్రధాన ఆర్థిక మార్గమైన ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ట్యాక్స్ సిబ్బందికి ‘టార్గెట్ల కష్టాలు’ మొదలయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ పీడీ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1,325 కోట్లు.. ఏప్రిల్ మాసంలో తిరిగి సర్కారు ఖజానాలోకి వెళ్లిపోవడం, మళ్లీ జీహెచ్ఎంసీ ఖాతాలోకి తిరిగి రాకపోవడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ చేసిన అప్పుల్లో ప్రతి నెలా అసలు, మిత్తి కలిపి రూ.110 కోట్లు కిస్తీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రతినెల జీతభత్యాలు, పెన్షన్ చెల్లింపులకు గానూ రూ.136 కోట్లు అవసరం అవుతున్నాయి. రొటీన్ మెయింటెనెన్స్‌తో కలుపుకుంటే నెలకు మొత్తం రూ.400 కోట్ల వరకు అవసరం అవుతున్నాయి. దీంతో, సర్కారు సాయం చేస్తే గానీ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో, అధికారులు జీహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
Read Also- Election Commission: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ కీలక ప్రకటన
ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధి లోని 30 సర్కిళ్లలో ట్యాక్స్ వసూలు చేస్తున్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అన్ని సర్కిళ్లలో కలిపి నెలకు రూ..300 కోట్లు ట్యాక్స్ కలెక్షన్ కచ్చితంగా చేయాల్సిందేనన్న నిబంధన విధించారు. అన్ని సర్కిళ్లలో తప్పనిసరిగా ప్రాపర్టీ ట్యాక్స్‌లు ముందస్తుగా వసూలు చేయాలని అధికారులకు షరతు విధించారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25 ) వసూలు అయిన మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ రూ.2,038 కోట్లలో సర్కిళ్ల వారీగా వసూలైన ట్యాక్స్ కలెక్షన్లను బట్టి టార్గెట్లు నిర్ణయించారు. సగటున 30 సర్కిళ్లలో కలిపి ప్రతి నెలాఖరు కల్లా మొత్తం రూ.300 కోట్లు బల్దియా ఖజానాకు రావాలన్న వ్యూహంతో అధికారులు సిబ్బందిని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ రూ.2,500 కోట్లుగా నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.1,700 కోట్లు వసూలు చేసుకొని ఖర్చు కూడా పెట్టారు.
Read Also- Minister Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క
అసంతృప్తిలో ట్యాక్స్ సిబ్బంది
జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ బస్సుల కోసం నియమించుకున్న 300 మంది బిల్ కలెక్టర్లు 145 మంది టాక్స్ ఇన్స్పెక్టర్లకు జీహెచ్ఎంసీ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కలెక్షన్ టార్గెట్లు నిర్దేశించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్సుల జారీ, పాత ట్రేడ్ లైసెన్స్‌లలో రెన్యూవల్‌తో పాటు అడ్వర్టైజ్‌మెంట్ చార్జీల బాధ్యతలను కూడా అప్పగించారు. కానీ, ఇందుకు టాక్స్ సిబ్బంది అంగీకరించలేదు. జీహెచ్ఎంసీ అవసరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పెంచుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ల టార్గెట్లతో తాము ఒత్తిడికి గురవుతున్నామని, తమకు పని భారం తగ్గించేందుకు ట్రేడ్ లైసెన్సు అడ్వర్టైజ్మెంట్ చార్జీల వసూళ్ల బాధితులను తప్పించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆందోళన కూడా చేపట్టారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ట్యాక్స్ సిబ్బంది అధికారులు కొత్తగా విధించిన టార్గెట్ల ప్రకారం నెలకు రూ.300 కోట్లు ట్యాక్స్ వసూలు చేస్తారా, లేక అధికారులు కొత్తగా విధించిన టార్గెట్లను నిరసిస్తూ మళ్లీ ఆందోళన చేస్తారా? అనేది వేచి చూడాలి.