Minister Seethakka: అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి
నీటిని డబుల్ క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలి
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
పీఆర్ అండ్ ఆర్‌డీ అధికారుల సమావేశంలో మంత్రి సీతక్క
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితులపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ సృజన, ఈఎన్‌సీలు కృపాకర్ రెడ్డి, ఎన్ అశోక్, ఇతర సంబంధిత అధికారులతో శనివారం ఆమె సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాలను గమనించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీరు కలుషితం కాకుండా, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, నీటిని డబుల్ క్లోరినేషన్ చేసి సరఫరా చేయడం వంటి చర్యలు కొనసాగించాలని తెలిపారు. వర్షాల కారణంగా తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణమే స్పందించడం అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని అధికారులను సీతక్క ఆదేశించారు. ఇందుకోసం కలెక్టర్ల వద్ద ఇప్పటికే ప్రత్యేక నిధులు అందుబాటులో ఉన్నందున, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తావించారు.
Read Also- Irfan Pathan: మేమంతా చనిపోయినట్టే అనిపించింది.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం మిషన్ భగీరథ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారని సీతక్క ప్రస్తావించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నీటి సరఫరా కేంద్రాలు, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నారని, ఈ పనులను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గ్రామాల నుంచి రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రదేశాల సమాచారం సేకరించి, తాత్కాలిక ప్రత్యామ్నాయ రహదారి సదుపాయాలను కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన రహదారులకు వాటిల్లిన నష్టంపై అధికారులు అంచనా వేయాలన్నారు.
Read Also- Paradha Film: ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు.. రివ్యూస్ చూసే థియేటర్స్‌కు రమ్మంటోన్న దర్శకుడు
గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజలను అక్కడి నుంచి తరలించాలని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పాటు, పరిష్కారం చూపించాలని సూచించారు. భవిష్యత్తులో ఏవైనా కొత్త సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు.