Free Engineering Education: 100 మంది పేద విద్యార్థులను సొంత ఖర్చులతో బీటెక్ చదివిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో 20వేల మంది యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని విద్యా రంగంలో అగ్రగామిగా నిలపాలనే ఏకైక లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా విద్యా నిధిని ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే పిలుపుకు ఆకర్షితులై సమాజంలో అన్ని వర్గాలు తమ శక్తి మేరకు విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. యెన్నం కూడా తన వేతనంలో ప్రతినెలా లక్ష రూపాయలు విద్యానిధికి విరాళంగా ఇస్తున్నారు. ఈ విద్యా నిధికి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. విద్యా నిధితో పాటుగా టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో స్టడీ మెటీరియల్‌ను ఉచితంగానే పంపిణీ చేస్తూ హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత కోచింగ్ ఇప్పిస్తున్నారు. మరోవైపు మహిళా ఆర్థిక స్వావలంబన కోసం వారిలో నైపుణ్యాలను వృద్ధి చెందించాలనే లక్ష్యంతో కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ తదితర వర్కింగ్ స్కిల్స్‌ను నేర్పి తద్వారా వ్యాపారాలు ప్రారంభించాలని ఔత్సాహికులైన మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా మంజూరు చేయిస్తున్నారు.
Also Read: MP Raghunandan Rao: 71 వేల ఫేక్ ఓట్లు.. బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు
రేవంత్ సహకారంతో..
ఆల్ మదీనా ట్రస్ట్‌కు మంజూరు కాబడిన జీకే ఇనిస్టూట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో 100 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించి తన సొంత ఖర్చులతో ఇంజనీరింగ్ విద్యను చదివించడానికి నిర్ణయించినట్లు యెన్నం తెలిపారు. ఈ 18 నెలల్లో పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీని మంజూరు చేయించుకోవడంతో పాటుగా ప్రైవేటు ట్రస్ట్ ద్వారా జీకే ఇంజనీరింగ్ కాలేజీని కూడా మంజూరు చేయించినట్లు తెలిపారు.
Also Read: Telangana Jagruti Presidents: 11 జిల్లాలకు జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం.. ప్రాధాన్యం ఎవరికంటే?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మహబూబ్ నగర్‌కే తీసుకువచ్చామని, ఈ ఏడాది తరగతులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. స్థానిక ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఒప్పించి జిల్లాకు నవోదయ పాఠశాలను కూడా మంజూరు చేయించామన్నారు. రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో ఏ ఒక్క యువకుడు కూడా నిరుద్యోగిగా రోడ్లపై తిరగకూడదనే మహోన్నత లక్ష్యంతోనే రాత్రింబవళ్లు కృషి చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే చూపిస్తున్న శ్రద్ధ పట్ల పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!