Durga Mata Temple Closed: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు నిండుతుంది. ప్రాజక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ మంజీర నదికి వదలడంతో ఘనపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండడంతో ఘనపూర్ ప్రాజెక్ట్ కింద ఉన్న 26,525 ఎకరాల ఆయకట్టులో రైతులు పంటలు పండించనున్నారు. నిన్న మొన్నటి వరకు నీటి విడుదలపై సందిగ్ధ పరిస్థితులు ఉండేవి. బీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా కలెక్టరేట్ ముందు నీటి విడుదల కోసం ధర్నా చేపట్టింది. అంతకు ముందు రైతులు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు నీటి విడుదలపై వినతి పత్రం అందించారు.
Also Read- Allu Aravind: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
ఇదిలా ఉండగా వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురవడంతో సింగూరు ప్రాజెక్టు నిoడటంతో.. నీటి విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ప్రాజెక్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మంజీర నది పరివాహక ప్రాంతం ఇరువైపుల బోరు బావులు, విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని వినియోగించి పరోక్షంగా, ప్రత్యక్షంగా 45 వేల ఎకరాల నుంచి, 55 వేల ఎకరాల వరకు పంటలు పండించనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంజీర నది 90 కిలో మీటర్లు ప్రవహించి.. మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామం గోలి లింగాల గ్రామం గుండా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. దీంతో ఘనపూర్, ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు, నిజాంసాగర్ ప్రాజెక్టు నిండితే ఆ ప్రాజెక్టు ఆయకట్టు సహితం సాగులోకి వస్తుంది.
Also Read- Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
దుర్గామాత ఆలయం మూసివేత.. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజ గోపురంలో పూజలు
ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం మూలంగా వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. దీంతో ఆలయ సమీపానగల వంతెనల వద్ద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ నిజాంసాగర్ వైపు పరుగులెడుతుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని గురువారం మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో నీరు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున భక్తులు ఎవరు ఆలయం వైపు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. వరద ఉధృతి తగ్గగానే ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పున:ప్రారంభిస్తామని ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఆలయం మూసివేసినందున పూజలు రాజగోపురంలో నిర్వహిస్తున్న విషయం భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
