Farmers Darna: తొర్రూరులో యూరియా కోసం రైతుల ధర్నా
పట్టణ కేంద్రంలో రోడ్డుపై బైఠాయింపు
రైతుల పాలిట శాపంగా మారిన యూరియా కొరత
పనులు వదిలి ఎరువు కోసం పడిగాపులు
పట్టించుకోని సంబంధిత అధికారులు
పాలకుర్తి, స్వేచ్ఛ: యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన ఘటన గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలో జరిగింది. సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు వదిలిపెట్టి మరీ యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ యూరియా దక్కకపోవడంతో ఆగ్రహించిన రైతులు గురువారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు.
కర్షకుల ధర్నాతో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అలవోకగా దొరికినట్టుగా యూరియా ఇప్పుడు దొరకడం లేదని, యూరియా కోసం తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.
Read Also- Manuguru Incident: పెద్ద కొడుకు నిర్వాకం.. భోరున ఏడుస్తున్న తల్లితండ్రులు
ఇనుగుర్తి మండలంలోనూ ఇదే పరిస్థితి
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కూడా రైతన్నలు యూరియా కోసం రోడ్డెక్కారు. మండల కేంద్రంలో ఉన్న సింగిల్ విండో ఎరువుల దిగుమతుల కేంద్రం వద్ద గురువారం కర్షకులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్ (PACS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల దిగుమతి కేంద్రంలో గత పది రోజులుగా యూరియా కొరత ఏర్పడింది. ఈ విషయంపై గురువారం మండల కేంద్రంలోని రైతులు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడిందని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచి ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున సహకార సంఘానికి రైతులు చేరుకున్నారు.
Read Also- SC on EC: 65 లక్షల ఓట్లు ఎందుకు డిలీట్ అయ్యాయి?.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు