Manuguru Incident: మణుగూరులో మంటగలిసిన మానవత్వం
కన్నపేగు బంధాన్ని మరిచిన కొడుకు
అమ్మానాన్నలు హాస్పిటల్‌లో ఉన్నా స్పందించని వైనం
ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోని వైఖరి
మణుగూరు, స్వేచ్ఛ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చంటి బిడ్డల్లా చూసుకోవాల్సిన వయసులో ఉన్న అమ్మానాన్నల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ఓ కొడుకు నిర్వాకం ఇది. వయోభారంతో, ఆరోగ్యం సహకరించక మంచాన పడ్డ కన్నతల్లిదండ్రులను ఓ దుర్మార్గుడు అస్సలు పట్టించుకోవడం లేదు. మణుగూరు మండలం రైల్వే గేట్ వద్ద నివాసం ఉంటున్న సింగరేణి రిటైర్డ్ వృద్ధ దంపతులు ఓర్సు బాలకోటి, అచ్చమ్మలను వారి పెద్ద కొడుకు పట్టించుకోవడం లేదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అతడు ప్రవర్తిస్తున్నాడు.
ఇటీవల తల్లి అచ్చమ్మ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో మణుగూరు సింగరేణి హాస్పిటల్‌లో చేరింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. తల్లి పరిస్థితి గురించి చెప్పేందుకు సదరు కొడుకుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసినప్పటికీ సమాధానం ఇవ్వడం లేదు. దీంతో, ఆసుపత్రికి వెళ్లి ఎవరూ చూడకపోవడంతో ఆ వృద్ధ దంపతులు భోరున విలపిస్తున్నారు. ఇద్దరూ నరకయాతన అనుభవిస్తున్నారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కొడుకు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. పెద్ద కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఎమ్మెల్యే చెప్పినా మారలేదు
కొడుకు వైఖరిపై ఇప్పటికే స్థానిక పెద్దలకు చెప్పి మాట్లాడించినా అతడి ధోరణిలో మార్పు రాలేదు. పైగా వృద్ధ దంపతులను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నాడు. వయసు మళ్లిన తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన కొడుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుండడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సదరు కొడుకు నివాసం ఉండేది స్థానిక ఎమ్మెల్యే ఇంటిపక్కనే ఓ పెద్ద ఇంటిలో నివసిస్తున్నాడు. తల్లిదండ్రుల విషయంలో సదరు ఎమ్మెల్యే మందలిచ్చినప్పటికీ, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ల గోడు పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ మధ్యనే తల్లి అచ్చమ్మ అనారోగ్యంతో మణుగూరు సింగరేణి హాస్పిటల్‌లో చేరింది. చికిత్స పొందుతోంది.
Read also- SC on EC: 65 లక్షల ఓట్లు ఎందుకు డిలీట్ అయ్యాయి?.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
చస్తే చావనివ్వండి
తల్లిదండ్రులు దయనీయ స్థితిలో ఉంటే కొంచెం కూడా కనికరం లేకుండా ‘వాళ్లను చస్తే చావనివ్వండి’’ అంటూ కొందరు బంధువులతో సదరు వ్యక్తి అంటున్నాడు. వాళ్లను పట్టించుకోనంటూ మొండికేస్తున్నాడు. వృద్ధ దంపతులు ఇరువురు ఏడ్చుకుంటూ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. మానవతా దృక్పథంతో సింగరేణి అధికారులు, పోలీసులు, హ్యూమన్ రైట్స్ అధికారులు జోక్యం చేసుకొని ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ వృద్ధ దంపతుల విషయంలో చొరవ తీసుకొని దుర్మార్గుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఆ వృద్ధ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తండ్రి జాబ్ చేస్తున్నాడు
పెద్ద కుమారుడికి జీవనోపాధి లేకపోవడంతో తన తండ్రి బాలకోటికి ఉన్న సింగరేణి ఉద్యోగాన్ని లాగేసుకున్నాడు. తండ్రికి 12 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ మాయ మాటలు చెప్పి, కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా ఉద్యోగాన్ని రాపించుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. తండ్రి నుంచి పొందిన ఉద్యోగాన్ని చేసుకుంటూ తాను, తన భార్య మాత్రమే అనుభవిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా, తల్లి అచ్చమ్మ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆరోగ్యాన్ని బాగుచేసుకునేందుకు డబ్బులు లేక, ఆ వృద్ధ దంపతుల బాగోగులు చూసేవారు లేక ఇద్దరూ కన్నీటిపర్యంతమవుతున్నారు.
Read also- J-K Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. పెద్ద సంఖ్యలో మృతులు!
