– నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టా?
– నియామకపత్రాలు ఇస్తేనే ఉపయోగం
– మళ్లీ అధికారంలోకి వస్తే 46 జీవో సమస్య పరిష్కరిస్తామని కేటీఆర్ అనడం హాస్యాస్పదం
– ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్
MLC Balmoor Venkat Slams KTR : కేటీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చెయ్యాలని, పేపర్ లీక్‌లపై మాట్లాడాలని మొత్తుకున్నా పట్టించుకోలని గుర్తు చేశారు.
బీఆర్ఎస్‌ది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్న చరిత్ర అని, జీవో 46పై పునరాలోచన చెయ్యాలని ఎన్నిసార్లు చెప్పినా లైట్ తీసుకున్నారని మండిపడ్డారు. ‘మా సర్కార్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుంది. జీవో 46తో చాలామంది నిరుద్యోగులు సఫర్ అయ్యారు. కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పడం సిగ్గుచేటు. అశోక్ నగర్‌లో ఓ నిరుద్యోగ యువతి చనిపోతే, తప్పుడు నిందలు వేసింది కేటీఆర్ కాదా? జీవో 46పై సర్కార్ సబ్ కమిటీ వేసింది. అంతలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. 317పై కూడా సబ్ కమిటీ వుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాం. పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో వున్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. ఈ ఏడాది పాత నోటిఫికేషన్లను భర్తీ చేసి, వచ్చే ఏడాది నుండి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నిరుద్యోగులకు గొడవ పెట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ వాళ్లు కాదా? మేము 30వేల ఉద్యోగాలను చట్టపరమైన చిక్కులు తొలగించి భర్తీ చేశాం. నోటిఫికేషన్ ఇస్తే జాబ్ ఇచ్చినట్టు కాదు. నియామక పత్రం ఇవ్వాలి. పేపర్ లీకేజ్‌పై సిట్ విచారణ కొనసాగుతోంది. హరీష్ రావు స్టాఫ్ నర్సుల జీతాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. 3 నెలల్లో మేము ఏం చేశామో చెప్తాం. ఏదైనా యూనివర్సిటీకి కేటీఆర్ రావడానికి సిద్ధమా? గత ప్రభుత్వంలో అధికారులు తప్పు చేసినా, వెనకేసుకుని వచ్చేవారు. ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే ఊరుకునేది లేదు. గ్రూప్-1 పరీక్ష సజావుగా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు బల్మూరి వెంకట్.