Bhatti Vikramarka: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మల్లు అన్నారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్(Hyderabad)లోని హెచ్ఐసీసీ నాక్ ఆడిటోరియంలో హామ్ ప్రాజెక్టు రహదారులపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రహదారులు నాగరికతకు చిహ్నాలు, రహదారులు అభివృద్ధి జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడికైనా ఉత్పత్తి అయిన వస్తువులను సునాయాసంగా తరలించవచ్చన్నారు.
రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి రాష్ట్ర యువతకు ఉపాధి, ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు తెలంగాణ రైజింగ్‌లో భాగంగా ఇన్‌ఫ్రా, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలను ముందుకు తీసుకుళ్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీల ద్వారా రాష్ట్రంలో 7,947 కి.మీ మేర, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 17 ప్యాకేజీల ద్వారా 5,190 మేరకు రోడ్లు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: Jr NTR: ఎన్టీఆర్ స్పీచ్ వార్ 2 కి మైనస్ గా మారిందా..? సినిమా రిజల్ట్ డౌటే అంటున్న నెటిజన్స్?
వారసత్వంగా అప్పులు..
క్యాబినెట్ ఆమోదించిన రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు బ్యాంకర్ల తోనూ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాంట్రాక్టర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని, గత ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని, రూ.45వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీచేసి ఆ బకాయిలు చెల్లించకుండా వారసత్వంగా ఆర్థిక భారాన్ని మిగిల్చారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ప్రభుత్వ సెక్రటరీలు దృష్టి పెట్టి పనిచేయడంతో క్రమంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయని భట్టి తెలిపారు.
కాంట్రాక్టర్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సంపద సృష్టిలో భాగస్వాములుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఇంకా కొన్ని రోడ్లను ఫోర్ లైన్ రోడ్లుగా మార్చాల్సి ఉందని, త్వరగా ఆ జాబితా రూపొందించి క్యాబినెట్‌లో పెట్టి ఆమోదం పొందాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రైజింగ్‌లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలని, హ్యామ్ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తామని భట్టి తెలిపారు.
నూతన శకం
మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో రహదారి అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హ్యామ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రహదారులు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు సులభంగా చేరుతాయని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆధునిక రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. వేగంగా, నాణ్యమైన రహదారులు నిర్మించేందుకు హామ్ విధానాన్ని అవలంబిస్తున్నామని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మారుమూల గూడెంలు, తండాలు, పల్లెలకు రహదారి వ్యవస్థను బలోపేతం చేసేందుకు హ్యామ్ ప్రాజెక్టుతో శ్రీకారం చుట్టామని, దేశానికి ఆదర్శవంతమైన రహదారి వ్యవస్థను నిర్మించాలన్నదే సీఎం, డిప్యూటీ సీఎంలు.. ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు.
యంగ్ స్టేట్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగ్ స్టేట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. హైబ్రిడ్ యాన్యుటి మోడ్ (హ్యామ్) రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతీ గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతీ మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతీ జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలో 5190కి.మీ రోడ్లు నిర్మాణం జరుగనుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమే కాబట్టి రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని కోమటిరెడ్డి వెల్లడించారు.
Also Read: Day 1 Box Office Collection: మొదటి రోజు సినిమా వసూళ్లలో వారిదే పైచేయి.. ఈ సారి వచ్చేది ఎవరంటే?