Chitrapuri 300 Cr Scam: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు 300 కోట్ల(Chitrapuri 300 Cr Scam) రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని సినీ కార్మికులు ఆరోపిస్తున్నారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, వాటిని బయటి వ్యక్తులకు అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు HMDA, CMO కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు,” అని వారు ఆరోపించారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని వారు మండిపడ్డారు.
Read also- Minister Seethaka: అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దు.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
ప్రధాన డిమాండ్లు
20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు న్యాయం చేయాలి. కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి. వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే అడ్-హాక్ కమిటీని నియమించాలి. కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి, అర్హులైన సినీ కార్మికులకే కేటాయించాలి. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.