Male Nurses: మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) 2005లోనే స్పష్టమైన జీవో ఉన్నప్పటికీ, కొందరు అధికారుల నిర్లక్ష్యానికి తాము అన్యాయానికి గురవుతున్నట్లు మేల్ నర్సులు(Male Nurses) స్పష్టం చేస్తున్నారు. ప్రమోషన్లలో వివక్షను తొలగించాలంటూ తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana Nurses Joint Action Committee) ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. రాజ్యాంగంలోని సమానత్వం, న్యాయ సూత్రాల ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎన్ ఏజేసీ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 2011 నుండి ఇప్పటి వరకు సుమారు వెయ్యి నుంచి 12 వందల వరకు మేల్ నర్సింగ్ ఆఫీసర్లు వివిధ ప్రభుత్వాసుపత్రులు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నట్లు వివరించారు.
అధికారులు న్యాయం చేయడం లేదు
ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నా వీరికి ప్రమోషన్లు రావడం లేదు. ఫీమేల్ విభాగంలో వీళ్ల కంటే జూనియర్లుగా ఉన్నా ప్రమోషన్లు లభించాయి. దీంతో తమకూ న్యాయం చేయాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. 1998లో విడుదలైన జీవో నంబరు 126, 1997లో వచ్చిన జీవో 101 ఆధారంగా తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆయా జీవోల ప్రకారం మహిళా నర్సులకే ప్రయారిటీ ఇచ్చినట్లు మేల్ నర్సులు వివరిస్తున్నారు. కానీ 2005లో వచ్చిన జీవోను పరిగణలోకి అధికారులు తమకు న్యాయం చేయడం లేదని మండిపడుతున్నారు. అడ్మిషన్ల కొరకు వచ్చిన ఈ జీవో ఆధారంగా అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ రూల్స్ లోనూ మార్పులు చేయడం ద్వారా మేల్ నర్సులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జీవో 126, 101 ల కారణంగా 2024 లో విడుదలైన లెక్చరర్ ప్రమోషన్ సీనియారిటీ జాబితాలో నూ ఒక్క పురుష అభ్యర్థి పేరు కూడా చేర్చలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read: TGSRTC Job Posts: త్వరలోనే పోస్టుల భర్తీకి కసరత్తు.. సజ్జనార్ స్పష్టం!
సమైక్య రాష్ట్రంలోనే క్లియర్ గా స్టడీ?
2005 సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekr Reddy) ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(Indian Nursing Councial)తో సంప్రదించి, 08-05-2005న జీవో నంబర్ 82 జారీ చేశారు. ఈ జీవో ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, స్కూళ్లలో పురుష విద్యార్థులకూ నర్సింగ్ కోర్సులు చదివే అవకాశం కల్పించారు. అయితే 2006లో జారీ చేసిన జీవో నంబర్ 320 ఆధారంగా నర్సింగ్ స్కూళ్లను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. దీనితో అన్ని ప్రభుత్వ నర్సింగ్ సంస్థలలో పురుషులకు అడ్మిషన్లకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని కాలేజీల్లో మేల్ నర్సులకు అడ్మిషన్లు కూడా ఇవ్వడం లేదని అభ్యర్ధులు మండిపడుతున్నారు. 4సెప్టెంబర్ 2014న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (హైదరాబాద్)లో జరిగిన విచారణలో జీవో నంబర్ 126లోని రూల్ 4(ఏ)ను సవరించవచ్చని, మహిళలకే అడ్మిషన్లు అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,ఆర్టికల్ 16 ప్రకారం ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని గతంలోనే పేర్కొన్నది. జీవోలు సవరించే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉన్నదని ట్రిబ్యునల్ గుర్తు చేసింది.
ఏపీలో క్లియర్
ట్రిబ్యునల్ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్(AP)లో ఈ అంశంపై గట్టి చర్యలు తీసుకున్నారు. జీవో నంబర్ 47 (14-03-2024) ద్వారా నర్సింగ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు చేస్తూ, “కేవలం మహిళలు” అనే పదాలను తొలగించి “పురుషులు ,మహిళలు”గా మార్చారు. ఈ సవరణలు 2024 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురితమయ్యాయి. ఇది ఎంతో మంది నర్సింగ్ చదవాలని భావిస్తున్న మేల్ విద్యార్ధులకు ప్లస్ అయింది. అంతేగాక అక్కడ ప్రమోషన్ల విషయంలోనూ ఎలాంటి వివక్ష లేకుండా సీనియారిటీ ప్రకారం ఎంపిక చేస్తున్నట్లు టీఎన్ జేఏసీ(TNJAC) స్పష్టం చేసింది. ఇక 2005 లో కాంగ్రెస్((Congress)) ప్రభుత్వం పురుష అభ్యర్థులకు నర్సింగ్ కోర్సులు చదివే అవకాశం,2011,2024లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ద్వారా సమానత్వం దిశగా తెలంగాణలో ముందడుగు పడగా ప్రమోషన్లలో మాత్రం పురుష అభ్యర్థులకు సమానఅవకాశాలుకల్పించలేకపోతున్నారు. ఇది సమర్ధవంతంగా పూర్తి కావాలంటే జీవో నంబర్ 466, 101, 126 లను సవరించాలని టీఎన్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.
Also Read; GHMC Meeting: భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం