TS News:
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
బహిరంగ క్షమాపణ చెప్పాలి
అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
లేదంటే రాజీనామా చేయాలి
మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దొంత నరేందర్ ఆగ్రహం
నిరసనలు నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం
మెదక్, స్వేచ్ఛ: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో భోజన విరామ సమయంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీఎన్జీవోస్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన (TS News) వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 7న మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహించింది. ఆ సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది.
Read Also- Doctor Post Vacancies: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గుడ్‌న్యూస్
ఈ సందర్భంగా మెదక్ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు దొంత నరేందర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల పట్ల జవాబుదారితనం, పారదర్శకత లక్ష్యంగా మెదక్ జిల్లాలో ప్రగతి పాలన అందిస్తున్నారని మెచ్చుకున్నారు. ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమష్టిగా కృషి చేస్తున్నారని, అంతటి సమర్థవంతమైన పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని దొంత నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Ravichandran Ashwin: టీమ్ నుంచి నన్ను రిలీజ్ చేయండి.. సీఎస్కే స్టార్ ప్లేయర్ విజ్ఞప్తి
ఇకముందు ఏ ప్రభుత్వ అధికారికైనా అన్యాయం జరిగినా, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వారికి అండగా మెదక్ జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ఉంటుందని, వారిని రక్షిస్తామని ఆయన చెప్పారు.
రాజకీయాలకతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా ప్రభుత్వ అధికారులు విధుల పట్ల చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తారని మెచ్చుకున్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సెక్రెటరీ జనరల్ విటల్, టీఎన్జీవో సెక్రెటరీ రాజ్ కుమార్, క్లాస్ ఫోర్త్ అధ్యక్ష కార్యదర్శులు జలగం ప్రసాద్, రిజ్వాన్ అలీ, ఎస్‌టీయూ అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, టీటీయూ అధ్యక్షులు శివయ్య, టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షుడు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఫజాలుద్దీన్, సంయుక్త కార్యదర్శులు శంకర్, శివాజీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జంగం నగేష్, గోపాల్, శ్రీ హర్ష ధనుంజయ్, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.