DGP Jitender: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణను డ్రగ్ ఫ్రీ (Drug Free Telangana ) స్టేట్ గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ (DGP Jitender) చెప్పారు. మాదక ద్రవ్యాల దందాను అరికట్టటానికి.. వినియోగాన్ని తగ్గించటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాన్నారు. దాంతోపాటు క్రిమినల్ గ్యాంగుల భరతం పట్టాలని సూచించారు. ఇలాంటి ముఠాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ యేడాది మొదటి ఆరు నెలల్లో జరిగిన నేరాలపై సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా నేతృత్వంలో రెండు రోజులుగా జరుగుతున్న సమీక్షా సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు తమ తమ యూనిట్ల పరిధుల్లోని క్రిమినల్ గ్యాంగులపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Medical Students Drugs: మెడికోస్ గంజాయి మత్తులో.. కోటిన్నర టర్నోవర్ కలిగిన మహిళా పెడ్లర్ అరెస్ట్
డ్రగ్స్ మహమ్మారి బారిన పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయటానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఎదురయ్యే దుష్పరిణామాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ దందాకు చెక్ పెట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పలువురు లోకల్, అంతర్ రాష్ట్ర పెడ్లర్లను అరెస్టులు చేసినట్టు చెప్పారు. ఈ దందా చేస్తున్న కొందరు నైజీరియన్లను కూడా కటకటాల వెనక్కి పంపించినట్టు తెలిపారు. డ్రగ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ నకిలీ మందులను అరికట్టేందుకు స్థానిక పోలీసులు సహకరించాలని కోరారు.
Also Read: Secunderabad Station: బిగ్ అలెర్ట్.. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే కష్టమే!
సీఐడీ డీఐజీ నారాయణ నాయక్ కొత్త చట్టాలు, మారిన సెక్షన్ ల గురించి వివరించారు. లీగల్ అడ్వయిజర్ అజయ్ కుమార్ ఆయా కేసుల దర్యాప్తులోని లోపాలను వివరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ గురించి వివరించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి వ్యవస్థీకృత నేరాలపై మాట్లాడారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ పిల్లలు, మహిళల కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి గురించి వివరించారు. గాంధీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృపాల్ సింగ్ దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ అంశాల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరిండింటెంట్ డాక్టర్ రాకేశ్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, అదనపు డీజీలు మహేశ్ భగవత్, శ్రీనివాసరావు, స్వాతి లక్రా, హైదరాబాద్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, తఫ్సీర్ ఇక్భాల్, రమేశ్ నాయుడు, రమేశ్, శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?