Cloudburst warning: హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. నగరంలో మేఘవిస్పోటనాన్ని (Cloudburst warning) తలపించే రీతిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు (Flash Floods) ముంచెత్తే సూచనలు ఉన్నాయని వాతావరణ అప్‌డేట్‌లు అందించే ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ హెచ్చరించింది. చెరువులు, నాళాలు అకస్మాత్తుగా పొంగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావొచ్చని హెచ్చరించింది. రానున్న కొన్ని గంటలు హైదరాబాద్‌కు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ (ఆగస్టు 7) రాత్రి 8-10 గంటల మధ్య అతి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహదీపట్నం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో కేవలం ఒక గంట వ్యవధిలోనే 80 నుంచి 100 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదు కావొచ్చని గ్రేటర్ అంచనాగా ఉంది. ఈ స్థాయి వర్షపాతం మేఘవిస్పోటన స్థాయికి సమీపంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే వరద ముప్పు పొంచి ఉంది.
Read Also- Bribe Case: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి.. ఎంతో తెలుసా?
అతి భారీ వర్షాలపై హైడ్రా కమిషనర్ కూడా నగర వాసులను ఒక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 గంటల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రయాణ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు, రోడ్లపై నిలిచే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్పప్రయాణాలు చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
నగరమంతా మేఘావృతం
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఆకాశమంతా మేఘావృతమై ఉంది. గంటలవారీ వాతావరణ అంచనాల ప్రకారం చూస్తే, ఈ రోజు రాత్రంతా వర్షం పడే అవకాశం ఉంది. దీనిపై భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అప్రమత్తత జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ముప్పు కూడా ఉందని హెచ్చరించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవిస్తే, నీటమునిగే ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు. వెంటనే ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. నీటితో నిండిన రహదారులపై ప్రయాణాలు చేయకూడదు. టార్చ్ లైట్, నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ వంటివి దగ్గర ఉంచుకోవాలి. భారీ వర్షం కురిసే సమయంలో ఇంట్లోనే భద్రంగా ఉండాలి. బయట డ్రెయినేజీల దగ్గర, అండర్‌పాసుల వద్ద ఉండకూడదు. జీహెచ్ఎంసీ, విపత్తు బృందాల సూచనలు తప్పక పాటించాలి.
Read Also- Khammam: ‘డేట్ ఆఫ్ బర్త్’ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే… చనిపోయినట్టు జారీ చేశారు