– రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్
– కేటీఆర్ మాదిరి తండ్రి పేరు చెప్పుకుని రాలేదు
– స్వయం కృషితో సీఎం స్థాయికి ఎదిగారు
– అవినీతి, పార్టీ పతనంతో కేటీఆర్‌కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది
– నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు
– జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమే
– ఏలేటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్
– హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ముందుచూపే కారణం
– బీఆర్ఎస్, బీజేపీపై కోమటిరెడ్డి ఫైర్
KTR: మొన్నటిదాకా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల యుద్ధం జరగగా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వార్ జరుగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలో సై అంటే సై అంటున్నాయి. అభ్యర్థుల తరఫున కీలక నేతలు ప్రచారం చేస్తూ మాటల మంటలు రాజేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హస్తం నేతలు ఈ కామెంట్స్‌కు దీటైన కౌంటర్స్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు.
ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్
కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి. రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, సీఎంను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌లా నాన్న పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేశారు. ఆయన తన స్వయం కృషితో జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగారని వివరించారు. మూసీ నదిపై ఓ బ్రిడ్జీ కట్టి అభివృద్ధి చేశామని చెబుతున్నారని, మరి ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్ వే, ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ ఏమని చెప్పాలంటూ సెటైర్లు వేశారు.
అన్ని రకాల వడ్లకు బోనస్
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సన్న వడ్లను ప్రోత్సహించాలని అనుకున్నామని, అందుకోసమే బోనస్ అని ప్రకటించామని వివరించారు. అంతే తప్ప దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలేదని, వాటికి కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవ లేదని, రెండు మూడు చోట్ల డిపాజిట్లు దక్కుతాయని కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, మరోవైపు కవిత జైలులో ఉండటంతో ఆయన మెంటల్ బ్యాలెన్స్ తప్పుతున్నదని విమర్శించారు. కవితను జైలులో నుంచి బయటకి తీసుకురావడానికి బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతున్నదని, జూన్ 5వ తేదీ తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కేఏ పాల్‌లా తిరగాల్సిందేనని చురకలంటించారు.
కాంగ్రెస్ ముందుచూపే కారణం
తెలంగాణలో ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, కేటీఆర్, హరీశ్ రావు, మహేశ్వర్ రెడ్డి మెంటల్ బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు మంత్రి. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 12 సీట్లు రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమైతే కేటీఆర్ రాజ్యమేలారని, మూసీ నదిపై ఒక కేబుల్ బ్రిడ్జి కట్టి హైదరాబాద్ అంతా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం వింతగా ఉన్నదని విమర్శించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు హైటెక్ సిటీ మొదలు పెడితే, కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని వివరించారు. హైదరాబాద్‌కు పరిశ్రమలు వస్తున్నాయంటే అందుకు కాంగ్రెస్ ముందు చూపే కారణం అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును బీఆర్ఎస్ అమ్ముకుందని, ఎంత తిన్నారో తనకు తెలియదని అన్నారు. వైన్ షాపు టెండర్ల ద్వారా తెలంగాణ యువకుల రక్తం తాగారని మండిపడ్డారు.
ఏలేటి పేరు తలవాలంటే ఇన్సల్ట్
బీజేపీలో సీనియర్ నేత రాజా సింగ్‌ను కాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ పదవి తీసుకున్నారని, ఆయన పేరు తలవాలంటేనే ఇన్సల్ట్‌గా ఉన్నదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ఎల్పీ బాధ్యత కేటీఆర్‌కు ఇస్తే హరీశ్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. వైఎస్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని వివరించారు.