Kaleswaram: కాళేశ్వరం బండారం బయటపడింది. బీఆర్ఎస్ నేతలు చెప్పిన గొప్పలు ఉత్త మాటలేనని తేలిపోయింది. అనేక అంశాలను క్రోడీకరించి జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన కాళేశ్వరం నివేదికపై అధికారులు అధ్యయనం చేశారు. పది పేజీలతో రిపోర్ట్ తయారు చేశారు. అందులో కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆరేనని తేల్చారు. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఓ అండ్ ఎం అవకతవకలకు కేసీఆరే బాధ్యుడని స్పష్టం చేశారు. రిపోర్ట్‌లో ఎవరెవరు ఏఏ తప్పులు చేశారో కూడా వివరించారు. రాజకీయ నాయకులతోపాటు ఉన్నతాధికారుల పాత్రను బయటపెట్టారు.
మోడల్ స్టడీ లేకుండా డిజైన్స్ ఆమోదం
కాళేశ్వరం డిజైన్స్ ఆమోదంపై కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మోడల్ స్టడీ లేకుండానే డిజైన్స్‌ను సీడీవో ఆమోదించినట్టు చెప్పింది. నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన కూడ లేదని స్పష్టం చేసింది. నివేదికలో ఆపరేషన్, నిర్వహణ లోపాలకు సీడీవో కారణమని తెలిపింది. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు ఈటల, హరీశ్ రావు, మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌కే జోషి, మాజీ సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యవహరించిన తీరును కమిషన్ తప్పుబట్టింది. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వీరు వ్యవహరించినట్టు తేల్చింది. నిపుణుల కమిటీ రిపోర్ట్‌ను ఎస్‌కే జోషి తొక్కి పెట్టారని, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, అప్పటి చీఫ్ ఇంజినీర్ హరిరాం కాంట్రాక్టుల విషయంలో వాస్తవాలు దాచారని తెలిపింది.
Read Also- Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!
సిట్ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అదే దిశగా ముందుకెళ్తున్నది. కమిషన్, అధికారుల రిపోర్టులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నది. బాద్యులపై చర్యలకు సిట్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయనున్నట్టు సమాచారం. ఒక డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. నిపుణులతో కూడిన సభ్యులు అందులో ఉండనున్నారు. క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. క్యాబినెట్ ముందు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. భేటీలో చర్చించాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొన్నది.
కాళేశ్వరం అక్రమాలపై ‘స్వేచ్ఛ’ సంచలన కథనాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న గొప్పదేం కాదని, చాలా అవకతవకలు జరిగాయని పక్కా ఆధారాలతో ఏడాదిన్నరగా ‘స్వేచ్ఛ’ అనేక సంచలన కథనాలు ఇచ్చింది. కాంట్రాక్టుల విషయంలో అప్పటి కీలక అధికారుల పాత్ర, కమీషన్ల కోసం చేసిన వ్యవహారాలు ఇలా అన్నింటినీ ప్రజల ముందు ఉంచింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికలో సంచలన విషయాలు పొందుపరచగా, రానున్న రోజుల్లో కీలక పరిణామాలు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Read Also- Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..